ఐఫోన్ కోసం సగటు భారతీయుడు ఎంతకాలం కష్టపడాలంటే?

26-09-2021 Sun 18:10
  • మార్కెట్‌లో ఐఫోన్ 13 ధర రూ. 79,900
  • దాన్ని కొనాలంటే భారతీయులు 724.2 గంటలు కష్టపడాలి
  • బ్రిటిష్ సంస్థ సర్వేలో వెలుగు చూసిన ఆసక్తికర అంశాలు
Average Indian will have to work over 700 hours to afford an iPhone 13
పెద్దా చిన్నా లేకుండా అందరికీ ఆసక్తి కలిగించే మొబైల్ బ్రాండ్లలో ఐఫోన్ ఒకటి. రోజురోజుకూ ఈ మొబైల్ ధర పెరుగుతూనే ఉంది. కొత్త కొత్త మోడల్స్ మార్కెట్లో ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సెక్యూరిటీ విషయంలో ఐఫోన్‌ను మించింది మరొకటి లేదని చాలా మంది వినియోగదారుల నమ్మకం.

అందుకే ఎప్పటికైనా ఐఫోన్ కొనాలని చాలా మంది సామాన్యులు కూడా కలలు కంటుంటారు. మరి ఈ కలను నిజం చేసుకోవడానికి సామాన్యులకు ఎంతకాలం పడుతుంది? ఈ ప్రశ్నకు బ్రిటన్‌కు చెందిన మనీ సూపర్‌మార్కెట్ అనే సంస్థ సమాధానం చెప్పింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఐఫోన్ 13 (128 జీబీ వెర్షన్) కొనుగోలు చేయాలంటే సగటు భారతీయుడు కనీసం 724.2 గంటలు పనిచేయాల్సి ఉంటుంది.

ఈ ఫోన్ మార్కెట్‌ ధర రూ. 79,900. ఇంత సొమ్ము కావాలంటే భారతీయులు 724 గంటలు పనిచేయాల్సిందేనని ఈ సర్వే తేల్చింది. అదే సమయంలో ఫిలిప్పైన్స్ వాసులు 775.3 గంటలు పనిచేస్తే కానీ వారి చేతిలోకి ఐఫోన్ రాదని తేలింది.

ప్రపంచంలో అత్యంత తక్కువ సమయంలో ఐఫోన్ దక్కించుకునేది స్విట్జర్లాండ్ వాసులు. వీళ్లు ఈ ఖరీదైన మొబైల్ కోసం కేవలం 34.3 గంటలు పనిచేస్తే చాలట. సగటున ఆయా దేశాల్లో ప్రజలకు వచ్చే నెల జీతాలను పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే నిర్వహించినట్లు సమాచారం.