ఆసీస్ విజయ పరంపరకు బ్రేకులు వేసిన భారత మహిళలు

26-09-2021 Sun 17:55
  • 26 వన్డేల్లో ఓటమి ఎరుగని కంగారూ మహిళలు
  • మూడు మ్యాచుల సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో భారత్ గెలుపు
  • చరిత్రలోనే అతిభారీ లక్ష్యాన్ని ఛేదించిన భారత మహిళలు
India Women end Australia 26 ODI unbeaten streak
వన్డేల్లో ఓటమెరుగని ఆసీస్ జట్టుకు భారత మహిళలు షాకిచ్చారు. ఒక్క ఓటమి కూడా లేకుండా 26 వన్డేలు గెలిచి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆస్ట్రేలియా మహిళలకు చివరకు ఓటమి రుచిచూపారు. భారత్-ఆసీస్ మహిళల జట్ల మధ్య మూడు మ్యాచుల వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ రెండో మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడిన భారత జట్టు చిట్టచివరి బంతికి ఓటమిపాలైంది.

అయితే మూడో మ్యాచులో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఆడిన భారత మహిళలు ఎట్టకేలకు గెలుపు రుచిచూశారు. ఆదివారం జరిగిన మూడో వన్డేలో రెండు వికెట్ల తేడాతో విజయం నమోదు చేశారు. ఆస్ట్రేలియా మహిళలు నెలకొల్పిన 26 మ్యాచుల విజయ పరంపర క్రికెట్ చరిత్రలోనే రికార్డు.

మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో భారత అమ్మాయిలు అద్భుతమైన పట్టుదల చూపారు. ఓపెనర్ షెఫాలీ శర్మ (56), యాస్తిక భాటియా (64) సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. చివరికి మరో మూడు బంతులు మిగిలుండగానే ఫోర్ బాదిన ఝులన్ గోస్వామి భారత జట్టుకు విజయాన్ని కట్టబెట్టింది.