గులాబ్ తుపానుపై సీఎం జగన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ

26-09-2021 Sun 16:35
  • అమెరికా నుంచి తిరిగొచ్చిన మోదీ
  • గులాబ్ తుపానుపై సమీక్ష
  • సీఎం జగన్ ను అడిగి వివరాలు తెలుసుకున్న వైనం
  • ఏపీకి కేంద్రం అండగా ఉంటుందని హామీ
PM Modi talks to CM Jagan on Gulab cyclone effect
అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.... ఏపీ, ఒడిశా రాష్ట్రాల వైపు దూసుకొస్తున్న గులాబ్ తుపానుపై దృష్టి సారించారు. ఏపీ సీఎం జగన్ తో గులాబ్ తుపానుపై మాట్లాడారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. విపత్తు నేపథ్యంలో కేంద్రం నుంచి అన్ని రకాల సాయం అందుతుందని సీఎం జగన్ కు మోదీ హామీ ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.

తూర్పుమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న గులాబ్ తుపాను ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్ పూర్ కు 140 కిలోమీటర్లు, శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను తాకనుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. ఈ అర్ధరాత్రి కళింగపట్నం-గోపాల్ పూర్ మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని పేర్కొంది.

గులాబ్ ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 75 నుంచి 95 కిమీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉభయగోదావరి, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. గులాబ్ ప్రభావం తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒడిశా, విదర్భలపైనా ఉంటుందని వివరించారు.