పవన్ కల్యాణ్... నువ్వు అడిగిన ప్రతి మాటకు అక్టోబరు 10 తర్వాత సమాధానం చెబుతా: మోహన్ బాబు

26-09-2021 Sun 16:19
  • రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ ఘాటు వ్యాఖ్యలు
  • మోహన్ బాబు పైనా విసుర్లు
  • స్పందించిన మోహన్ బాబు
  • డియర్ పవన్ కల్యాణ్ అంటూ ప్రకటన
Mohan Babu replies Pawan Kalyan remarks
రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సినీ రంగ సమస్యలపై మోహన్ బాబు వంటి పెద్దలు స్పందించాలని, ఏపీలో తన బంధువులైన వైసీపీ నాయకులతో మాట్లాడి చిత్ర పరిశ్రమను హింసించొద్దని మోహన్ బాబు చెప్పాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దీనిపై మోహన్ బాబు స్పందించారు. నా ప్రియమైన పవన్ కల్యాణ్ అంటూ ఓ ప్రకటన చేశారు.

నా చిరకాల మిత్రుడి సోదరుడైన పవన్ కల్యాణ్... నువ్వు నాకంటే చిన్నవాడివి కాబట్టి ఏకవచనంతో సంబోధించాను అని వెల్లడించారు. అయితే పవన్ కల్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమీ లేదని పేర్కొన్నారు. చాలా కాలానికి తనను ఈ వ్యవహారంలోకి లాగావు... సంతోషం అంటూ పవన్ ను ఉద్దేశించి మోహన్ బాబు వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం 'మా' ఎన్నికల కోలాహలం నెలకొని ఉంది, అక్టోబరు 10న 'మా' ఎన్నికలు ముగిసిన తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకు హృదయపూర్వకంగా సమాధానం చెబుతానని మోహన్ బాబు స్పష్టం చేశారు.

'మా' ఎన్నికల్లో తన కుమారుడు మంచు విష్ణు పోటీ చేస్తున్నాడని, పవన్ కల్యాణ్ తన కుమారుడు మంచు విష్ణు ప్యానెల్ కు ఓటేయాలని మోహన్ బాబు ఈ సందర్భంగా సూచించారు.