కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తే.. తమ్ముడు చేస్తున్న దారుణం వెలుగులోకి

26-09-2021 Sun 15:06
  • 20 ఏళ్లుగా పథకం ప్రకారం చంపుతున్న దుర్మార్గుడు
  • ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వెలుగు చూసిన ఘటన
  • ఆగస్టులో కుమారుడు కనిపించకుండా పోయాడని ఫిర్యాదు
  • దర్యాప్తులో వెలుగు చూసిన దారుణాలు
man kills 5 members of family over 20 years for property
ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులనే హత్య చేశాడో దుర్మార్గుడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక 48 ఏళ్ల వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. 20 ఏళ్లుగా తన పథకం అమలు చేస్తూ వచ్చిన నిందితుడు.. కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులను చంపేశాడు. మృతదేహాలు ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు వాటిని నీటిలో పడేశాడు.

వారసత్వంగా వస్తున్న ఆస్తిని హస్తగతం చేసుకోవాలనే ఆలోచనతోనే నిందితుడు ఇంత ఘోరానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఇంతకాలం కుటుంబంలో జరుగుతున్న ఘోరాలు ఎవరూ గుర్తించలేదని పోలీసులు తెలిపారు.

చంపిన వారి మృతదేహాలను నీటిలో పడేయడంతో ఈ హత్యల విషయం ఇంతకాలం ఎవరికీ తెలియలేదని పోలీసులు చెప్పారు. ఈ ఘోరం తాజాగా వెలుగు చూడటంతో సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

తన కుమారుడు కనిపించడం లేదని నిందితుడు అన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. లీలు త్యాగి అనే వ్యక్తి ఘజియాబాద్‌లోని మురాద్‌నగర్‌లో నివసిస్తున్నాడు. కుటుంబానికి చెందిన 9 ఎకరాల ఆస్తికోసం అతను ఐదుగురిని హత్య చేసినట్లు తెలుస్తోంది.