తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం ధర్మాన

26-09-2021 Sun 14:52
  • ఉత్తరాంధ్రపై గులాబ్ తుపాను ప్రభావం
  • అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసిన ధర్మాన
  • మరో రెండ్రోజులు వర్షాలు పడతాయని వెల్లడి
  • నదులకు వరదలు వచ్చే అవకాశం ఉందన్న ధర్మాన
Dy CM Dharmana Krishna Das visited cyclone effective places
బంగాళాఖాతంలో బలపడిన గులాబ్ తుపాను ఉత్తరాంధ్ర తీర ప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో, ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తుపాను ముప్పు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాకి మండలం సముద్ర తీర ప్రాంతాలు గుల్లవానిపేట, గుప్పిడిపేట, రాజారాంపురం ప్రాంతాల్లో పర్యటించిన ధర్మాన అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు.

మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలకు లోటు ఉండరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా, భారీ వర్షాలతో వరద గండం పొంచి ఉన్నందున వంశధార, నాగావళి నదుల్లో నీటి మట్టం పరిస్థితులను అంచనా వేసి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

అదే సమయంలో, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో, గ్రామాల్లో నీరు నిలవ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, వ్యాధులను అరికట్టాలని జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు.