చిత్ర పరిశ్రమ సమస్యలను ఏపీ ప్రభుత్వం తక్షణమే పరిశీలించాలి: హీరో నాని

26-09-2021 Sun 14:19
  • నిన్న రిపబ్లిక్ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్
  • ఏపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన పవన్ కల్యాణ్
  • మండిపడుతున్న ఏపీ మంత్రులు
  • పవన్ ప్రస్తావించిన వ్యాఖ్యలకు నాని మద్దతు
  • అవి నిజంగా సమస్యలేనని వెల్లడి
Hero Nani responds to Pawan Kalyan comments
రిపబ్లిక్ చిత్రం ప్రీరిలీజ్ వేడుకలో ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు వైసీపీ మంత్రులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. మంత్రులు వరుసబెట్టి పవన్ ను ఏకిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని స్పందించారు.

సినీ రంగం క్షేమంగా ఉండడమే ముఖ్యమని... పవన్ కల్యాణ్, ఏపీ ప్రభుత్వం మధ్య ఉన్న రాజకీయ విభేదాలను పక్కనబెట్టేద్దామని తెలిపారు. పవన్ కల్యాణ్ లేవనెత్తిన సినీ రంగం సమస్యలను చిత్తశుద్ధితో పరిశీలించాల్సిన అవసరం ఉందని, దీనిపై తక్షణ స్పందన అవసరమని అభిప్రాయపడ్డారు. చిత్ర రంగ ఇబ్బందులను పూర్తిస్థాయిలో ప్రస్తావించిన పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

"చిత్ర పరిశ్రమలో ఓ సభ్యుడిగా సీఎం జగన్ కు, మంత్రులకు నేను విజ్ఞప్తి చేసేది ఒక్కటే... తెలుగు సినిమా మరింత దెబ్బతినకముందే స్పందించండి. వెంటనే సంబంధిత సమస్యలపై చర్యలు తీసుకోండి" అంటూ నాని పేర్కొన్నారు.