సంపూర్ణేశ్ బాబు అయినా... పవన్ కల్యాణ్ అయినా ఒక్కటే!: ఏపీ మంత్రి అనిల్ కౌంట‌ర్

26-09-2021 Sun 13:30
  • సినిమాల్లో వారిద్ద‌రిలో ఎవ‌రూ న‌టించినా కష్టం అనేది ఒక‌టే
  • సినిమా టికెట్లు ఆన్‌లైన్‌ లో అమ్మితే తప్పేంటి?
  • వైసీపీ నేతలపై ట్రోలింగ్ చేయడానికే పవన్‌ వ్యాఖ్యలు
  • రాజకీయ ఉనికి కోసం ముఖ్య‌మంత్రి జగన్ ను తిడుతున్నారు
anil slams pawan
సినిమా టికెట్లు ఆన్‌లైన్‌ లో అమ్మితే తప్పేంటని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్ర‌శ్నించారు. నిన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై అనిల్ కుమార్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ...  త‌మ‌కు సంపూర్ణేశ్ బాబు అయినా... పవన్ కల్యాణ్ అయినా ఒక్కటేన‌ని చెప్పారు. సినిమాల్లో వారిద్ద‌రిలో ఎవ‌రు న‌టించినా కష్టం అనేది ఇద్దరిదీ ఒకటేనని ఆయ‌న వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలపై ట్రోలింగ్ చేయడానికే పవన్‌ వ్యాఖ్యలు చేశార‌ని, ఎంత ట్రోలింగ్‌ చేసుకుంటారో చేసుకోండని ఆయ‌న అన్నారు.

రాజకీయ ఉనికి కోసం ముఖ్య‌మంత్రి జగన్ ను తిట్టడం పవన్ కల్యాణ్ కు ఫ్యాషన్ అయిపోయిందని మంత్రి అనిల్ అన్నారు. ఆన్‌లైన్‌లో టికెట్ల పోర్టల్ గురించి సినీ పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దలతో చర్చించారని ఆయ‌న చెప్పారు. తాము పారదర్శకత కోసమే ఆన్‌లైన్ టికెట్ల విక్ర‌యాల‌ను తీసుకొస్తున్నామ‌ని తెలిపారు. సినిమా ఖర్చులో కేవలం నలుగురైదుగురికి మాత్రమే లబ్ధి ఎక్కువగా ఉంటుందని, ఇది స‌రికాద‌ని ఆయ‌న అన్నారు. ప‌వ‌న్ ఒక్కడి కోసమే సినీ ప‌రిశ్ర‌మ‌ను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆయ‌న అన‌డం స‌రికాద‌ని మంత్రి అనిల్ చెప్పారు.