నిన్న సాయితేజ్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి వెల్లంప‌ల్లి తీవ్ర వ్యాఖ్య‌ల‌తో కౌంట‌ర్

26-09-2021 Sun 11:24
  • 'పావలా.. స‌న్నాసి' అంటూ వెల్లంప‌ల్లి వ్యాఖ్య‌లు
  • ఒక్క సీటు కూడా గెలవలేద‌ని విమ‌ర్శ‌లు
  • చిరంజీవి లేకపోతే పవన్ జీరో అని వ్యాఖ్య‌
  • బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకుని బతకాలనుకునే వ్యక్తి ప‌వన్ అంటూ వ్యాఖ్య‌లు
vellampalli slams pawan kalyan
'పావలా.. స‌న్నాసి' అంటూ జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి వెల్లంప‌ల్లి విరుచుకుప‌డ్డారు. సాయితేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఏపీ స‌ర్కారుపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డ విష‌యం తెలిసిందే. 'సన్నాసుల్లారా, దద్దమ్మల్లారా' అంటూ ఆయ‌న చేసిన‌ వ్యాఖ్య‌ల‌పై ఈ రోజు మీడియా స‌మావేశంలో వెల్లంప‌ల్లి స్పందిస్తూ కౌంట‌ర్ ఇచ్చారు.

ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ల త‌ర‌ఫున డైలాగులు చెప్పే వ్యక్తి పావలా పవన్ కల్యాణ్ అని ఆయ‌న అన్నారు. జ‌న‌సేన పార్టీ విజయవాడ కార్పొరేషన్ లో ఒక్క సీటు కూడా గెలవలేద‌ని ఆయ‌న చెప్పారు. పవన్ క‌ల్యాణ్‌ కంటే సన్నాసి ఈ రాష్ట్రంలో ఎవరూ లేరని ఆయ‌న అన్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ప‌వ‌న్ క‌ల్యాణ్ రాష్ట్రంలో రెండు స్థానాల్లో పోటీ చేసి ఒక చోట కూడా గెలవలేక పోయాడని ఆయ‌న అన్నారు.

ఏపీలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు చోటు లేదని తెలిసిపోయింద‌ని ఆయ‌న చెప్పారు. అస‌లు అన్న‌య్య‌ చిరంజీవి లేకపోతే పవన్ జీరో అని ఆయ‌న విమ‌ర్శించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఫామ్ హౌస్ లో కూర్చుని పేకాట ఆడ‌డానికి తప్ప దేనికీ పనికి రాడ‌ని ఆయ‌న అన్నారు.

త‌మ‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని మంత్రి వెల్లంప‌ల్లి హెచ్చరించారు. బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకుని బతకాలనుకునే వ్యక్తి ప‌వన్ అంటూ ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. సినిమా టికెట్లు ప్రభుత్వం అమ్మితే తప్పేంటని ఆయ‌న నిల‌దీశారు.