దళితులను కించపరిచేలా వ్యాఖ్యల కేసు.. బెయిలుపై బయటకొచ్చిన సినీ నటి మీరా మిథున్

26-09-2021 Sun 10:18
  • సినీ రంగంలోని ఎస్టీ, ఎస్టీలపై అనుచిత వ్యాఖ్యల కేసు
  • ఆగస్టు 14న మీరా మిథున్, ఆమె స్నేహితుడు అభిషేక్ అరెస్ట్
  • షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసిన కోర్టు
Chennai court grants bail to actor Meera Mithun
దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన సినీనటి మీరా మిథున్‌కు బెయిలు లభించింది. ఐదు వారాలపాటు జైలులో ఉన్న ఆమెకు చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు బుధవారం నిబంధనలతో కూడిన బెయిలు మంజూరు చేయగా, నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. సినీ రంగంలోని ఎస్సీ, ఎస్టీలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆగస్టు 14న పోలీసులు ఆమెను కేరళలో అరెస్ట్ చేశారు.

కాగా, ఇదే కేసులో ఆమె స్నేహితుడు అభిషేక్ కూడా అరెస్టయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరూ జైలులోనే ఉన్నారు. కోర్టు వీరిద్దరికీ రూ. 10 వేల చొప్పున పూచీకత్తుపై బెయిలు మంజూరు చేసింది. అలాగే, ప్రతి రోజూ ఉదయం 10.30 గంటలకు పోలీసుల ఎదుట హాజరు కావాలని, సాక్ష్యాలను తారుమారుచేసే ప్రయత్నం చేయవద్దని ఆదేశించింది. బెయిలు మంజూరు చేయడంతో నిన్న జైలు నుంచి బయటకు వచ్చారు. అనంతరం క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లారు.