Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో మీడియాపై ఉక్కుపాదం.. 150కిపైగా సంస్థల మూత

  • మీడియా సంస్థలపై అడుగడుగునా ఆంక్షలు
  • ప్రభుత్వం, మీడియా కార్యాలయాల సమన్వయంతో వార్తలు రాయాలని హెచ్చరిక
  • ముద్రణను నిలిపేసిన దినపత్రికలు
  • ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచురించకుండా 11 నియమాలు తీసుకొచ్చిన తాలిబన్లు
Taliban form 11 new rules to curb Afghan media content

ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు వశం చేసుకున్నాక అక్కడి మీడియా సంస్థలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. వార్తా సంస్థలపై తాలిబన్లు ఉక్కుపాదం మోపడమే అందుకు కారణం. తాలిబన్ల దృష్టి మీడియాపై పడడంపై అక్కడి జర్నలిస్టులు ఆందోళనకు గురవుతున్నారని అమెరికాకు చెందిన ‘న్యూయార్క్ టైమ్స్’ తెలిపింది. మతానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ పెద్దలను అవమానించేలా ఉండే వార్తలను ప్రచురించకుండా ఉండేందుకు తాలిబన్లు 11 నియమాల పేరుతో కొత్తగా ఓ విధానాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వం, మీడియా కార్యాలయాల సమన్వయంతో జర్నలిస్టులు వార్తలు, కథనాలు రాయాలని తాలిబన్ల నుంచి మీడియా సంస్థలకు హెచ్చరికలు అందినట్టు అమెరికా పత్రిక పేర్కొంది.

ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల పరమయ్యాక  రోజువారీ వార్తలు కూడా ప్రచురించలేని పరిస్థితి దాపురించిందని, ఫలితంగా 150కిపైగా మీడియా సంస్థలు మూతపడ్డాయని ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. పలు దినపత్రికలు ముద్రణను నిలిపివేసి ఆన్‌లైన్‌కే పరిమితమయ్యాయి. కాగా, తమకు సాయం చేయాలంటూ వందల సంఖ్యలో తమకు ఈ-మెయిళ్లు వస్తున్నట్టు అమెరికాకు చెందిన పత్రికా  స్వేచ్ఛ సంస్థ సీనియర్ సభ్యుడు స్టీవ్ బట్లర్ చెప్పడం ఆఫ్ఘనిస్థాన్‌లో మీడియా ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది.

  • Loading...

More Telugu News