వామపక్ష నేత సీతారాం ఏచూరి కుటుంబంలో విషాదం

25-09-2021 Sat 22:05
  • సీతారాం ఏచూరి తల్లి కల్పకం కన్నుమూత
  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కల్పకం
  • క్షీణించిన ఆరోగ్యం.. నేడు ఢిల్లీలో మృతి
Sitharam Yechuri mother Kalpakam dies of illness

వామపక్ష నేత, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయనకు మాతృవియోగం కలిగింది. సీతారాం ఏచూరి తల్లి కల్పకం ఏచూరి కన్నుమూశారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న కల్పకం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించడంతో నేడు తుదిశ్వాస విడిచారు.

కాగా, వైద్య పరిశోధనల నిమిత్తం తన తల్లి మృతదేహాన్ని ఆరోగ్య పరిశోధన సంస్థలకు అప్పగించాలని సీతారాం ఏచూరి నిర్ణయించుకున్నారు. సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ గత వేసవిలో కరోనాతో కన్నుమూయగా, కొన్నినెలల తేడాతో ఆయన ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది.

కల్పకం మృతి పట్ల కేరళ సీఎం విజయన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు సంతాపం తెలియజేశారు. కల్పకం సామాజిక వేత్తగా ఎంతో గుర్తింపు పొందారు. దుర్గాబాయి దేశ్ ముఖ్ కు ఆమె అభిమాని.