హెరాత్ నగరంలో మృతదేహాన్ని క్రేన్ కు వేళ్లాడదీసిన తాలిబన్లు

25-09-2021 Sat 20:12
  • ఆఫ్ఘన్ లో తాలిబన్ల నిజస్వరూపం
  • హెరాత్ నగరానికి 4 మృతదేహాల తరలింపు
  • నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో మృతదేహాల ప్రదర్శన
  • వారు కిడ్నాపర్లు అని వెల్లడించిన తాలిబన్లు
Taliban hangs dead body to a crane

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల నిజస్వరూపం బట్టబయలవుతోంది. తాజాగా హెరాత్ నగరంలో ఓ మృతదేహాన్ని క్రేన్ కు వేళ్లాడదీసి ప్రదర్శించారు. హెరాత్ లోని ప్రధాన కూడలిలో తాలిబన్ల చర్యతో ఆఫ్ఘన్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. హెరాత్ నగరంలోని వజీర్ అహ్మద్ సిద్ధిఖీ అనే ఫార్మసీ యజమాని ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు.

అతడు మీడియాతో మాట్లాడుతూ, తాలిబన్లు మొత్తం 4 మృతదేహాలను తీసుకువచ్చారని, వాటిలో ఒకదాన్ని ప్రధాన కూడలి వద్ద ప్రదర్శించారని, మిగతా మూడు మృతదేహాలను నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి ప్రదర్శించారని వెల్లడించాడు. ఆ నలుగురిని కిడ్నాపింగ్ నేరంలో పోలీసులు హతమార్చినట్టు తాలిబన్లు ప్రకటించారని సిద్ధిఖీ తెలిపాడు.

దేశంలో ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం పాలన సాగుతుందని ఇటీవలే తాలిబన్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, కాల్పుల్లో ఈ నలుగురు మరణించారా? లేక ఆ నలుగురిని అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హతమార్చారా? అనేది స్పష్టం కాలేదు.