'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' మరోసారి వాయిదా?

25-09-2021 Sat 18:52
  • అఖిల్ హీరోగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'
  •  రొమాంటిక్ లవ్ స్టోరీగా సాగే కథ
  • ముందుగా చెప్పిన తేదీ అక్టోబర్ 8
  • అక్టోబర్ 15కి షిఫ్ట్ అయిందంటూ టాక్
Most Eligible Bachelor is October 15th
అఖిల్ హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా నిర్మితమైంది. 'బొమ్మరిల్లు' భాస్కర్ రూపొందించిన ఈ సినిమాలో, అఖిల్ జోడీగా పూజ హెగ్డే అలరించనుంది. గోపీసుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, విడుదలకు ముస్తాబై చాలా రోజులైంది. కానీ కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చింది.

సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు ఓపెన్ కావడంతో, చాలా సినిమాలు థియేటర్ల బాట పట్టాయి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భావించి, ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను కూడా వదిలారు. అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాను పండుగకు ముందు కాకుండా విజయదశమి రోజునే రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. అంటే అక్టోబర్ 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ఇదే రోజున 'వరుడు కావలెను' వస్తున్న సంగతి తెలిసిందే.