హాలీవుడ్ హీరో తాగుబోతు చేష్టలు... బయటికి గెంటేసిన రెస్టారెంట్ యాజమాన్యం

25-09-2021 Sat 17:36
  • లాస్ వేగాస్ లో ఘటన
  • బార్ అండ్ రెస్టారెంట్ లో నికోలాస్ కేజ్ వీరంగం
  • మద్యం మత్తులో నోటికొచ్చినట్టు వాగిన వైనం
  • తీవ్రంగా స్పందించిన రెస్టారెంట్ యాజమాన్యం
Vegas restaurant sent out Nicolas Cage

హాలీవుడ్ కథానాయకుడు నికోలాస్ కేజ్ మద్యం మత్తులో అమర్యాదకరంగా ప్రవర్తించడం, ఆపై రెస్టారెంట్ యాజమాన్యం బయటికి గెంటేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాస్ వేగాస్ లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్లిన నికోలాస్ కేజ్ మద్యం మత్తులో నోటికొచ్చినట్టు వాగాడు. మద్యం తాగి వున్న ఉన్న ఓ వ్యక్తిని నానా మాటలు అనడంతో రెస్టారెంట్ లో ఇబ్బందికర వాతావరణం నెలకొంది. దాంతో రెస్టారెంట్ యాజమాన్యం హీరో నికోలాస్ కేజ్ ప్రవర్తన పట్ల తీవ్రంగా స్పందించింది.

రెస్టారెంట్ సిబ్బందిలో ఒకరు అతడి చెప్పులను తీసుకువచ్చి, ఇక దయచేయాలంటూ ప్రధాన ద్వారాన్ని చూపించారు. ఆ చెప్పులను కాళ్లకు వేసుకోవడానికి నానా తంటాలు పడిన నికోలాస్ కేజ్... బయటికి వెళ్లినట్టే వెళ్లి మళ్లీ లోపలికి రావడానికి ప్రయత్నించాడు. అయితే రెస్టారెంట్ సిబ్బంది కేజ్ కు అడ్డునిల్చోవడం వీడియోలో కనిపించింది.

దీనిపై రెస్టారెంట్ సిబ్బంది స్పందిస్తూ... ఖరీదైన 1980 మెకల్లాన్ విస్కీని బాగా తాగాడని, ఆపై టెకీలా కూడా పుచ్చుకున్నాడని వివరించారు. దాంతో మద్యం కిక్కు తలకెక్కిందని అన్నారు. ఓ దశలో ఫైటింగ్ కు సిద్ధమయ్యాడని, అందుకే బయటికి పంపించివేశామని వెల్లడించారు. కాగా, ఆ బార్ కు తరచుగా వచ్చేవారు కొందరు నికోలాస్ కేజ్ ను అతడి ఇంటికి తరలించారు.

గతంలోనూ నికోలాస్ కేజ్ తన తాగుబోతు చేష్టలతో వార్తల్లోకెక్కాడు. కేజ్ వ్యక్తిగత జీవితం ఒడిదుడుకుల మయం అని చెప్పాలి. ఇప్పటివరకు ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఈ ఏడాది తన తల్లి జోయ్ వోగెల్ శాంగ్ ను కోల్పోయాడు. 57 ఏళ్ల నికోలాస్ కేజ్... లీవింగ్ లాస్ వేగాస్, కాన్ ఎయిర్, ఫేస్ ఆఫ్, ఘోస్ట్ రైడర్, నేషనల్ ట్రెజర్ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. లీవింగ్ లాస్ వేగాస్ చిత్రంలో ఉత్తమ నటనకు గాను ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నాడు. ఆ సినిమాలో నికోలాస్ కేజ్ పోషించింది ఓ తాగుబోతు పాత్ర కావడం విశేషం!