Komatireddy Venkat Reddy: ఇలాంటివి నచ్చకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా: కోమటిరెడ్డి

  • తెలంగాణ కాంగ్రెస్ కార్యకలాపాలపై కోమటిరెడ్డి అసంతృప్తి
  • తనకు షో రాజకీయాలు తెలియవని స్పష్టీకరణ
  • పార్టీలో ఏం జరుగుతోందో అర్థం కావడంలేదని వ్యాఖ్యలు
  • రాహుల్, ప్రియాంకలకు వివరిస్తానని వెల్లడి
Komati Reddy fires on Telangana Congress

తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు ఎవరు చేపట్టినప్పటికీ ఏదో ఒక మూల అసంతృప్తి గళం వినిపిస్తూనే ఉంటుంది. జగ్గారెడ్డి వ్యవహారం సద్దుమణిగిందనుకున్న తరుణంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. కొత్త పీసీసీ వచ్చి మూడున్నర నెలలు అయినా, ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు రివ్యూ చేయట్లేదని ప్రశ్నించారు.

పీసీసీ నేతలు హుజూరాబాద్ ఎందుకు వెళ్లడంలేదని నిలదీశారు. పార్టీలో అసలేం జరుగుతోందో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు భారీగానే ఓటు బ్యాంకు ఉందని, గత మూడు ఎన్నికల్లో 60 వేల వరకు ఓట్లు వచ్చాయని, అందరం కలిసి పనిచేస్తే మరో 50 వేల ఓట్లు రావా? అని హితవు పలికారు.

సీనియర్లను ఇన్చార్జిలుగా నియమించి, వారానికి ఒక్కసారి సమావేశం ఏర్పాటు చేస్తే పార్టీ గెలవదా? అని పేర్కొన్నారు. జీరోగా ఉన్న దుబ్బాకలో 23 వేల ఓట్లు తెచ్చుకున్నామని, కానీ హుజూరాబాద్ పోరును కాంగ్రెస్ వదిలేస్తే దానర్థం ఏంటి? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. హుజూరాబాద్ లో యుద్ధానికి ముందే చేతులెత్తేస్తామా? ప్రజల్లో ఎలాంటి సంకేతాలు వెళతాయి? అంటూ అసహనం ప్రదర్శించారు.

ఇలాంటివన్నీ భరించలేకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. తనకు ఇలాంటి షో రాజకీయాలు తెలియవని పేర్కొన్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తుంటే పార్టీ సన్నద్ధమయ్యేది ఇలాగేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్లను సంప్రదించకుండా అధికార ప్రతినిధులను నియమిస్తారా? వచ్చేవారం రాహుల్ గాంధీ, ప్రియాంకలకు ఈ విషయాలు వివరిస్తానని వెల్లడించారు. ఏ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయాలి, అప్పుడే గెలుస్తుందని అన్నారు.

More Telugu News