India: ఇమ్రాన్ ఖాన్‌కు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చిన ఐరాస‌ భార‌త ప్ర‌తినిధి స్నేహ‌

  • జ‌మ్మూక‌శ్మీర్‌, ల‌డ‌ఖ్ భార‌త్‌లో అంతర్భాగం 
  • వాటిని భార‌త్ నుంచి ఎవ‌రూ వేరు చేయ‌లేరు
  • ఉగ్ర‌వాదుల‌కు పాకిస్థాన్ అడ్డాగా మారింది
  • లాడెన్‌కు పాకిస్థానే ఆశ్ర‌యం ఇచ్చింది
sneha dubey slams pak

పాకిస్థాన్‌కు భార‌త్ గట్టిగా బ‌దులిచ్చింది. ఐరాస‌ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో పాక్‌ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ క‌శ్మీర్ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అన‌డం ప‌ట్ల ఐరాస‌లోని భార‌త ప్ర‌తినిధి స్నేహ దూబే అభ్యంత‌రాలు తెలిపారు. జ‌మ్మూక‌శ్మీర్‌, ల‌డ‌ఖ్ భార‌త్‌లో అంతర్భాగమని ఆమె చెప్పారు.

వాటిని భార‌త్ నుంచి ఎవ‌రూ వేరు చేయ‌లేర‌ని స్నేహ చెప్పారు. ఉగ్ర‌వాదుల‌కు పాకిస్థాన్ కేంద్ర బిందువుగా మారుతోంద‌ని, ఉగ్ర‌వాదుల‌ను పాక్ పెంచి పోషిస్తున్న విష‌యాన్ని ప్ర‌పంచ దేశాలు బ‌హిరంగంగానే అంగీక‌రిస్తున్నాయ‌ని గుర్తు చేశారు.  

ఐరాస‌ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్ర‌వాదుల్లో ఎక్కువ శాతం మంది పాకిస్థాన్‌లో ఉన్న విష‌యాన్ని గ్ర‌హించాల‌ని ఆమె అన్నారు. ఉగ్ర‌వాదుల‌కు పాక్ మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని స్నేహ చెప్పారు. ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్థానే ఆశ్ర‌యం ఇచ్చింద‌ని, అంతేగాక‌, ఇప్ప‌టికి కూడా ఆ ఉగ్ర‌వాదిని పాక్‌ ఓ అమ‌రుడిగా గుర్తిస్తోంద‌ని ఆమె అన్నారు.

పాక్ అవ‌లంబిస్తున్న విధానాల వ‌ల్లే ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్నార‌ని ఆమె విమ‌ర్శించారు. కాగా, స్నేహ దూబే 2012 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీస‌ర్‌. ప్ర‌స్తుతం న్యూయార్క్‌లో ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశాలు జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. పుణెలోని ఫెర్గూస‌న్ కాలేజీలో ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించారు.

ఢిల్లీలోని జ‌వ‌ర్‌లాల్ నెహ్రూ స్కూల్ ఆఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్ట‌డీస్ నుంచి స్నేహ దూబే ఎంఫిల్ పూర్తి చేశారు.  ఇమ్రాన్ ఖాన్‌కు ఆమె దీటుగా స‌మాధానం ఇవ్వ‌డం ప‌ట్ల భార‌త్ ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తోంది. మ‌రోవైపు, ఈ రోజు ఐరాస భ‌ద్ర‌తా మండలి స‌మావేశంలో భార‌త ప్ర‌ధాని మోదీ మాట్లాడ‌నున్నారు.

More Telugu News