మూడు ప్రయత్నాలు.. ఫస్ట్ టైం ఫెయిల్.. మూడో సారి టాపర్.. ఇదీ సివిల్స్ ఫస్ట్ ర్యాంకర్ అంతరంగం

25-09-2021 Sat 12:29
  • బలహీనవర్గాల కోసమే తన సేవలన్న శుభమ్ కుమార్
  • తన తండ్రి ప్రోత్సాహం వల్లే సివిల్స్ సాధించానని కామెంట్
  • గ్రామీణాభివృద్ధి కోసం పనిచేస్తానన్న సెకండ్ ర్యాంకర్ జాగృతి
Civils Topper Says His Service Is Always For Underpriviliged

మూడు ప్రయత్నాలు.. మొదటి ప్రయత్నంలో విఫలం.. రెండో అటెంప్ట్ లో ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీసెస్ (ఐడీఏఎస్)కు ఎంపిక.. మూడో ప్రయత్నంలో టాపర్.. ఇదీ నిన్న విడుదలైన సివిల్స్ ఫలితాల్లో టాపర్ గా నిలిచిన శుభమ్ కుమార్ ట్రాక్ రికార్డ్. ఐఐటీ బాంబే నుంచి సివిల్ ఇంజనీరింగ్ పట్టా పొంది 24 ఏళ్ల ప్రాయంలోనే ఆయన సివిల్స్ టాపర్ అయ్యారు. బీహార్ లోని కతిహార్ కు చెందిన శుభమ్.. ప్రస్తుతం పూణేలోని నేషనల్ అకాడమీ ఆఫ్ డిఫెన్స్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ లో శిక్షణ తీసుకుంటున్నారు.

సివిల్స్ లో టాప్ ర్యాంక్ సాధించడం పట్ల ఆయన తన అంతరంగాన్ని పంచుకున్నారు. 2020లో ఆంథ్రపాలజీని తన ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఎంచుకున్న ఆయన.. జనం కోసమే పనిచేస్తానని చెబుతున్నారు. సమాజంలో బడుగు, బలహీన వర్గాల వారికి సేవ చేస్తానని తెలిపారు. ప్రజలను బాగు చేయాలంటే ఐఏఎస్ ఓ మంచి వేదిక అనుకున్నానని, అందుకే ఐఏఎస్ సాధించాలనుకున్నానని శుభమ్ చెప్పారు.  

పేదరికాన్ని అంతం చేయడం, గ్రామాలు, గ్రామాల్లోని ప్రజల అభివృద్ధే తన ధ్యేయమని పేర్కొన్నారు. తాను సాధించిన ఈ ఘనతలో తన తల్లిదండ్రులు, శిక్షణ తీసుకున్న ఇనిస్టిట్యూట్, ఆ సంస్థ డైరెక్టర్ ఎనలేని ప్రోత్సాహం అందించారని చెప్పారు. తన తండ్రి ఎల్లప్పుడూ తనలో పాజిటివ్ యాటిట్యూడ్ ఉండేలా చూశారని, ఏదైనా సాధించేందుకు ప్రేరణ ఇచ్చేవారని తెలిపారు. అదే తాను ఫస్ట్ ర్యాంకర్ గా నిలవడానికి దోహదం చేసిందన్నారు. తన తండ్రి బీహార్ లో బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నారని శుభమ్ చెప్పారు.

కాగా, గ్రామీణాభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని సెకండ్ ర్యాంకర్.. భోపాల్ కు చెందిన జాగృతి అవస్థి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను చేతివృత్తుల్లో తీర్చిదిద్దితే ప్రపంచంలోనే భారత్ లీడర్ గా ఎదుగుతుందన్నారు. ఆమె భోపాల్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. బీహెచ్ఈఎల్ లో రెండేళ్లు పనిచేసిన ఆమె.. సోషియాలజీని తన సబ్జెక్ట్ గా ఎంచుకున్నారు.