రేవంత్ రెడ్డిపై జ‌గ్గారెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆగ్ర‌హం

25-09-2021 Sat 11:27
  • నిన్న రేవంత్ రెడ్డిపై జ‌గ్గారెడ్డి విమ‌ర్శ‌లు
  • జ‌గ్గారెడ్డి వ్యాఖ్య‌ల‌పై ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్ ఆరా
  • బోసురాజుతో మాట్లాడి స‌మాచారం తెప్పించుకున్న ఇన్‌చార్జ్‌
  • ఈ రోజు మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌కు ఠాగూర్ 
Tagore to visit Hyderabad

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి తీరుపై నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌తో తెలంగాణలోని ఆ పార్టీ నేత‌ల్లో ఉన్న విభేదాలు మరోసారి బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. రేవంత్ రెడ్డి జ‌హీరాబాద్ వ‌స్తున్న‌ట్లు త‌నకు స‌మాచారం లేదని, వ్య‌క్తిగ‌త ప్ర‌చారానికే ఆరాట‌ప‌డితే పార్టీలో కుద‌ర‌దని ఆయ‌న అన‌డం అనంతరం చోటు చేసుకున్న ప‌రిణామాల ప‌ట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఆరా తీస్తోంది.

జ‌గ్గారెడ్డి వ్యాఖ్య‌ల‌పై ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్ వివ‌రాలు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుతో మాట్లాడి స‌మాచారం తెప్పించుకున్నారు. ఈ రోజు మ‌ధ్యాహ్నం మాణికం ఠాగూర్ హైద‌రాబాద్ రానున్నారు. జ‌గ్గారెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై పీసీసీ పీఏసీలో చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. టీపీసీసీ అధ్య‌క్షుడిపై జ‌గ్గారెడ్డి చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్ర‌హంతో ఉంది. త‌మ పార్టీకి ఆయ‌న వ్యాఖ్య‌లు న‌ష్టం క‌లిగిస్తాయ‌ని భావిస్తోంది.