నన్ను చంపేస్తానని బెదిరించాడు: కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

25-09-2021 Sat 10:57
  • లక్ష్మన్న అనే వ్యక్తి తప్ప తాగొచ్చి నాపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు
  • జగన్ ప్రభుత్వంలో క్రైమ్ పెరిగిపోతోంది
  • తాగుబోతులు రెచ్చిపోతున్నారు
One person threatened to kill me says Kotla Surya Prakash Reddy
టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇంటి వద్ద ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. సూర్యప్రకాశ్ రెడ్డిని చంపేస్తానంటూ కేకలు వేశాడు. కర్నూలు జిల్లా లద్దగిరిలో ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో సూర్యప్రకాశ్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు.

ఈ ఘటన జరిగిన వెంటనే ఆయన పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు... సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశారు. కేకలు వేసిన వ్యక్తిని లద్దగిరి పక్కనే ఉన్న అల్లినగరం గ్రామానికి చెందిన లక్ష్మన్నగా గుర్తించారు. మద్యం మత్తులో ఆయన ఆ పని చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అతనిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

మరోవైపు ఈ ఘటనపై సూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, లక్ష్మన్న అనే వ్యక్తి తప్ప తాగి తన ఇంటి వద్దకు వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశాడని అన్నారు. తనను చంపేస్తానని బెదిరించాడని చెప్పారు. కేంద్ర మంత్రిగా పని చేసిన తనలాంటి వారి ఇంటి వద్దకే వచ్చి చంపేస్తామని బెదిరిస్తున్నారని... ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో క్రైమ్ పెరిగిపోతోందని... తాగుబోతులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.