టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టీకరణ

25-09-2021 Sat 09:43
  • వచ్చే ఎన్నికల్లో తాను కానీ, తన కుమార్తె కానీ పోటీ చేయబోమని ప్రకటన
  • నేరుగా చంద్రబాబుకే ఈ విషయాన్ని చెప్పినట్టు సమాచారం
  • పార్టీలో మాత్రం కొనసాగుతానని స్పష్టీకరణ
TDP MP Kesineni Nani decided to not to contest next Elections
టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, విజయవాడ అభ్యర్థిగా మరొకరిని చూసుకోవాలని అధినేత చంద్రబాబుకు చెప్పినట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం చంద్రబాబును కలిసిన సందర్భంగా ఈ విషయం స్పష్టం చేసినట్టు సమాచారం. తన కుమార్తె శ్వేత కూడా పోటీ చేయబోదని, ఆమె టాటా ట్రస్ట్‌కు వెళ్లిపోయిందని అధినేతకు స్పష్టం చేశారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేయనంత మాత్రాన పార్టీ నుంచి బయటకు వెళ్లబోనని, టీడీపీతోనే కొనసాగుతానని నాని చెప్పినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  

అయితే, నాని ఈ నిర్ణయం తీసుకోవడం వెనక బలమైన కారణమే ఉందని తెలుస్తోంది. విజయవాడ మేయర్ ఎన్నికలు, బుద్ధా వెంకన్న, బోండా ఉమా తదితరులు తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసినా పార్టీ అధిష్ఠానం పట్టించుకోలేదన్న మనస్తాపంతోనే ఆయనీ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో జరిగిన పార్టీ కార్యక్రమాలకు కూడా నాని హాజరుకాకపోవడం ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది.