వీహెచ్‌పీ సీనియర్ నేత త్రిలోక్ నాథ్ పాండే కన్నుమూత.. పూర్వీకుల స్వగ్రామంలో అంత్యక్రియలు

25-09-2021 Sat 09:13
  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న త్రిలోక్ నాథ్ పాండే
  • లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • అయోధ్య కేసులో సుదీర్ఘకాలంపాటు న్యాయపోరాటం
Senior VHP leader Triloki Nath Pandey passes away
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వహిందూ పరిషత్ సీనియర్ నేత, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రముఖుడు త్రిలోక్ నాథ్ పాండే  కన్నుమూశారు. లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. 15 రోజుల క్రితమే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు త్రిలోకి చిన్నకుమారుడు అమిత్ పాండే తెలిపారు.

త్రిలోక్ మృతదేహాన్ని అయోధ్యకు తీసుకొచ్చి బలియా జిల్లాలోని ఆయన పూర్వీకుల స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు చెప్పారు. త్రిలోక్ నాథ్ విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఆరెస్సెస్‌లో చేరారు. అయోధ్య కేసులో సుదీర్ఘకాలంపాటు న్యాయపోరాటం చేశారు. ఆయన మృతికి అయోధ్య మసీదు ట్రస్ట్ కార్యదర్శి అతహర్ హుస్సేన్ సహా పలువురు నివాళులు అర్పించారు.