మదర్ థెరిస్సాపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. భగ్గుమన్న క్రైస్తవ సంఘాలు

25-09-2021 Sat 07:05
  • రుషులు కావాలంటే హిందూ మతంలో గొప్ప పనులు చేయాలి
  • క్రైస్తవంలో మేజిక్కులు చేస్తే సెయింట్ హోదా వచ్చేస్తుంది
  • ప్రతాప్ సింహపై విరుచుకుపడుతున్న క్రైస్తవ సంఘాలు
  • క్షమాపణలు చెప్పాలని డిమాండ్
BJP MP Pratap Simha Controversial Comments on Mother Teresa
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, భారతరత్న మదర్ థెరిస్సాపై మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రుషులు, మహర్షులు కావాలంటే హిందూమతంలో ఎన్నో గొప్ప పనులు చేయాల్సి ఉంటుందని, కానీ క్రైస్తవంలో  సెయింట్ హోదా పొందాలంటే అవేం అక్కర్లేదని, మేజిక్కులు, గిమ్మిక్కులు చేస్తే సరిపోతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

మైసూరులో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఒక మహిళ కడుపులోని కేన్సర్ గడ్డను కరిగించడమనే అద్భుతమైన మేజిక్ చేసిన మదర్ థెరిస్సాకు సెయింట్ హోదా లభించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్రైస్తవ సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడ్డాయి. మదర్ థెరిస్సాపై నోరు పారేసుకున్నందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్  చేశాయి.