పూరి ఆలయం పూజారికి 'మత్తు' కబుర్లు చెప్పి ముంచేసిన యువతి!

24-09-2021 Fri 21:22
  • ఫేస్‌బుక్‌లో ఇద్దరి మధ్య పెరిగిన పరిచయం
  • కోల్‌కతాకు చెందిన యువతి ఇంటికొస్తే ఆహ్వానించిన పూజారి
  • మత్తు చల్లిన స్వీట్లు ఇచ్చి ఇంట్లో చోరీ
Puri temple robbed after eating drugging him with sweets
ప్రఖ్యాత పూరీ జగన్నాథ్ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. సదరు పూజారికి పరిచయమైన ఒక యువతి ఆయన ఇంటికి వచ్చింది. అతిథి కదా అని ఆదరించిన అతనికి ఆమె స్వీట్లు అందించింది. అవి తినగానే ఆ పూజారి స్పృహతప్పాడు. ఆ తర్వాత అతని ఇల్లంతా గాలించి విలువైన వస్తువులన్నింటినీ ఆ యువతి దొంగిలించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పూరీ జగన్నాథ్ ఆలయంలో ఒక వ్యక్తి పూజారిగా పనిచేస్తున్నాడు. అతనికి కోల్‌కతాకు చెందిన పియూ బిశ్వాస్ అనే ఒక యువతితో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్యా స్నేహం పెరిగింది. తాను ఓ ఇన్స్యూరెన్స్ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నట్టు చెప్పింది. అంతేకాదు, ఓ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలని అతన్ని పట్టుబట్టింది. దాంతో ఆమెను తన ఇంటికి ఆహ్వానించాడు.

ఈ క్రమంలో ఇటీవల అతన్ని కలవడానికి సదరు యువతి ఒడిశా చేరుకుంది. అక్కడ అతని ఫ్లాట్‌కు వెళ్లింది. కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత అతని కోసం తీసుకొచ్చానంటూ స్వీట్లు అందించింది. ఆమె ఇచ్చిన స్వీట్లు తిన్న సదరు పూజారి స్పృహ తప్పాడు.

ఆ తర్వాత ఇంట్లోని ఆభరణాలు, డబ్బు మొత్తం కలిపి రూ. 10 లక్షల విలువైన వస్తువులను ఆ యువతి దొంగిలించింది. స్పృహలోకి వచ్చిన తరువాత తాను మోసపోయినట్లు గ్రహించిన పూజారి.. పోలీసులను ఆశ్రయించాడు. తనకు స్వీట్స్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి, దొంగతనం చేసిందని యువతిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు యువతిని అదుపులోకి తీసుకున్నారు.