India: ప్రధాని మోదీపై క్రికెట్ దిగ్గజం కెవిన్ పీటర్సన్ ప్రశంసలు

  • ఖడ్గమృగాల కోసం చాలా చేస్తున్నారని మెచ్చుకోలు
  • ప్రపంచ నేతలు మోదీ అడుగుజాడల్లో నడవాలని సలహా
  • మోదీ ఒక హీరో అంటూ కితాబునిచ్చిన మాజీ క్రికెటర్
South Africa former cricketer calls Indian Prime Minister Modi a Hero

ఇంగ్లండ్ మాజీ స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఆటగాడిగానే కాదు, పర్యావరణ ప్రేమికుడిగా కూడా చాలా పాప్యులర్. పర్యావరణ పరిరక్షణ కోసం జరిగే అన్ని పనులనూ ఆయన మెచ్చుకుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన ప్రశంసల వర్షం కురిపించాడు. ఖడ్గమృగాల సంరక్షణ కోసం భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలను పీటర్సన్ మెచ్చుకున్నాడు.

ఈ విషయంలో ప్రపంచ దేశాధినేతలు మోదీ ప్రభుత్వ అడుగు జాడల్లో నడవాలని సూచించాడు. ప్రధాని మోదీ ఒక హీరో అంటూ కితాబునిచ్చాడీ మాజీ క్రికెటర్. ‘‘భూమిపై ఖడ్గమృగాల కోసం ఎంతో చేస్తున్న అంతర్జాతీయ నేత నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. మరింత మంది నేతలు కూడా ఇలా చేస్తే ఎంత బాగుంటుంది. భారత్‌లో ఖడ్గమృగాల సంఖ్య పెరగడానికి ఈ చర్యలే కారణం. నిజంగా ఎంత గొప్ప హీరో’’ అంటూ ట్వీట్ చేశాడు. కేపీ ట్విట్టర్ ఖాతా హెడర్ ఫొటోలో కూడా అతను ఖడ్గమృగం పక్కనే కూర్చున్న ఫొటో ఉండటం గమనార్హం.

సెప్టెంబరు 22న అంతర్జాతీయ ఖడ్గమృగ దినోత్సవాన్ని అసోంలో ఘనంగా నిర్వహించారు. ఆ రోజున 2,479 ఖడ్గమృగాల కొమ్ములను వేదాచారల ప్రకారం దహనం చేశారు. ఈ కార్యక్రమానికి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మోదీ స్పందించారు. ‘‘ఒక్క కొమ్ము గల ఖడ్గమృగం భారత దేశానికి గర్వకారణం. దాని శ్రేయస్సుకు అవసరమైన అన్ని చర్యలూ భారత్‌లో తీసుకుంటాం’’ అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News