Bank Accout: బ్యాంకులో ఖాతా లేదంటున్న వ్యక్తి.. అకౌంట్లో మాత్రం పదికోట్లు!

  • జాబ్ కార్డు కోసం బ్యాంకుకు వెళ్లిన విపిన్ చౌహాన్
  • అతని పేరిట ఉన్న ఖాతాలో రూ. 9.99 కోట్లు
  • ఖాతాను ఫ్రీజ్ చేసిన బ్యాంకు సిబ్బంది
  • బీహార్ లో వరుసగా వెలుగు చూస్తున్న ఇలాంటి ఘటనలు
man finds near 10 crore in his bank account which he never opened

ఉద్యోగాలు లేని వారి కోసం ప్రభుత్వం అందిస్తున్న ఎంజీఎన్ఆర్ఈజీఈ కార్డు కోసం బ్యాంకుకు వెళ్లిన వ్యక్తికి షాకింగ్ విషయం తెలిసింది. అతను వెళ్లిన బ్యాంకులో ఆ వ్యక్తి పేరిట ఖాతా ఉందని, దానిలో రూ. 10 కోట్ల వరకూ సొమ్ము ఉందని తెలిసింది. అతనేమో తనకు అసలు బ్యాంకు ఖాతానే లేదని చెబుతున్నాడు. ఈ వింత ఘటన బీహార్ లో వెలుగు చూసింది.

సుపాల్ టౌన్‌కు చెందిన విపిన్ చౌహాన్ అనే వ్యక్తి జాబ్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని అనుకున్నాడు. అతను స్థానికంగా కూలీగా పనిచేస్తుంటాడు. జాబ్ కార్డు కోసం స్థానికంగా ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వెళ్లాడు. అక్కడ ఉన్న సిబ్బంది అతని వివరాలు తీసుకున్నారు. తీరా చూస్తే విపిన్ ఆధార్ కార్డుతో ఒక బ్యాంకు ఖాతా అప్పటికే ఉందని తెలిసింది. అతని పేరిటే ఉన్న ఆ ఖాతాలో రూ. 9.99 కోట్ల డిపాజిట్ సొమ్ము కూడా ఉంది.

‘‘దీంతో సంబంధిత బ్యాంకు బ్రాంచిని సంప్రదించాను. ఈ ఖాతా 2016 అక్టోబరు 13న తెరిచారు. 2017 ఫిబ్రవరిలో ఖాతాలో కోట్ల రూపాయల సొమ్ము పడింది. అయితే ఈ ఖాతాలో నా ఫొటో, సంతకం, వేలిముద్ర ఏవీ లేవు. కేవలం నా ఆధార్ కార్డు నెంబరు, పేరు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఖాతాలో రూ.9.9 కోట్లు అలాగే ఉన్నాయి’’ అని చౌహాన్ తెలిపాడు.

కాగా, ఇలా బ్యాంకు ఖాతాల్లో సడెన్‌గా సొమ్ము చేరడం బీహార్ లో ఇది తొలిసారేమీ కాదు. కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి ఖాతాలో బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రూ. 5 లక్షలు జమయ్యాయి. వాటిని అతను వాడేసుకున్నాడు. విషయం తెలిసి ఆ సొమ్ము తిరిగివ్వాలని బ్యాంకు అధికారులు కోరగా అతను తన ఖాతాలో పడిన సొమ్ము ప్రధాని మోదీ నుంచి వచ్చిందనుకొని ఖర్చు పెట్టేసినట్లు చెప్పాడు. దీంతో బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ తర్వాత కూడా ఇద్దరు విద్యార్థుల ఖాతాలో 900 కోట్ల రూపాయలకు పైగా సొమ్ము జమ అయినట్లు చూపించిన ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో అంత సొమ్ము విద్యార్థుల ఖాతాల్లో లేదని, కానీ అలా చూపిస్తోందని, ఇది కేవలం సాంకేతిక సమస్యే అని బ్యాంకు అధికారులు వివరించారు.

More Telugu News