Mount Elbrus: రష్యాలోని మౌంట్ ఎల్ బ్రస్ పై మంచు తుపాను... ఐదుగురు పర్వతారోహకుల మృతి

Sudden snow storm at Mount Elbrus kills five Russian climbers
  • యూరప్ లో అత్యంత ఎత్తయిన పర్వతం ఎల్ బ్రస్
  • అకస్మాత్తుగా సంభవించిన మంచు తుపాను
  • రష్యా పర్వతారోహకుల బృందంలో విషాదం
  • 14 మందిని కాపాడిన అధికారులు
యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తయిన పర్వతం మౌంట్ ఎల్ బ్రస్ పై ఘోర మంచు తుపాను సంభవించింది. ఈ విపత్తు కారణంగా ఐదుగురు రష్యా పర్వతారోహకులు మరణించారు. మరో 14 మందిని సహాయక బృందాలు కాపాడాయి. రష్యాకు చెందిన పర్వతారోహకుల బృందం కాకసస్ పర్వతశ్రేణిలోని సమున్నతమైన మౌంట్ ఎల్ బ్రస్ ను అధిరోహించడానికి వెళ్లింది. అయితే వారి నుంచి అత్యవసర సందేశం రావడంతో అధికారులు వెంటనే స్పందించి సహాయక బృందాలను పంపించారు.

కాగా, మంచు తుపాను తరుముకు వస్తుండడంతో రష్యా పర్వతారోహకులు మూడు బృందాలుగా విడిపోయి ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీశారు. వారు చిన్న బృందాలుగా విడిపోవడం వల్లే ప్రాణహాని తక్కువగా జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

రష్యాలో ఉన్న మౌంట్ ఎల్ బ్రస్ పర్వతాన్ని ఇటీవలే ఏపీకి చెందిన ఓ యువతి, ఓ బాలుడు అధిరోహించారు. కాకినాడకు చెందిన సుతాపల్లి దేవి, ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు కుమారుడు గంధం భువన్ 5,642 మీటర్ల ఈ పర్వతాన్ని అధిరోహించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

మౌంట్ ఎల్ బ్రస్ వద్ద వాతావరణం ఎంతో అనిశ్చితితో కూడుకుని ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, తాజా ప్రమాదం జరిగిన సమయంలో మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉందని, పరిసరాలు కూడా స్పష్టంగా కనిపించడంలేదని పేర్కొన్నారు.
Mount Elbrus
Snow Storm
Death
Russian Climbers

More Telugu News