భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ అయ్యే అవకాశాలు పుష్కలం: శ్రేయాస్ అయ్యర్‌పై బ్రాడ్ హాగ్ ప్రశంసలు

24-09-2021 Fri 17:27
  • ఐపీఎల్ మ్యాచ్ తర్వాతి ప్రెస్‌మీట్ చూస్తేనే తెలుస్తుందన్న హాగ్
  • శ్రేయాస్ మానసికంగా ఎంతో పరిణతి చెందాడు
  • నాయకత్వ లక్షణాలు సంపూర్ణంగా ఉన్నాయని కితాబు
Brad Hogg says Shreyas will become Team India captain in future

భారత్‌లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన టీమిండియా యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ కోలుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రారంభమైన ఐపీఎల్ రెండో సెషన్‌లో అతను ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత సీజన్‌లో జట్టుకు నాయకత్వం వహించిన అయ్యర్.. ఈసారి జట్టులో ఆటగాడి పాత్రకే పరిమితమయ్యాడు.

అతను లేకపోవడంతో జట్టు పగ్గాలు పంత్‌కు అందించిన యాజమాన్యం.. అయ్యర్ తిరిగొచ్చిన తర్వాత కూడా సారధిగా పంత్‌నే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఇటీవల విడుదలైన భారత టీ20 ప్రపంచకప్ జట్టులో అయ్యర్ పేరు లేదు. ఈ క్రమంలో తీవ్రమైన ఒత్తిడిలో ఉంటాడని అందరూ అనుకున్న అయ్యర్ తన ఆటతీరుపై ఈ పరిణామాల ప్రభావం పడకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ విషయాన్నే ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ కొనియాడాడు.

‘ఢిల్లీ క్యాపిటల్స్ విజయం తర్వాత అయ్యర్ ప్రెస్‌మీట్ చూస్తే భవిష్యత్తులో అతను టీమిండియా కెప్టెన్ అవుతాడని అనిపించింది’ అని హాగ్ చెప్పాడు. శ్రేయాస్ మానసికంగా ఎంతో పరిణతి చెందాడని మెచ్చుకున్నాడు. గాయం నుంచి కోలుకున్నా టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కలేదు, ఐపీఎల్ జట్టు సారధ్యం కూడా తొలగించారు.. ఇలాంటి సందర్భంలో అతనిపై చాలా ఒత్తిడి ఉంటుందని హాగ్ అన్నాడు.

కానీ దీని ప్రభావం తన ఆటతీరుపై పడకుండా రీఎంట్రీ తొలి మ్యాచ్‌లో 47 పరుగులు చేశాడు. అయితే ఈ ఇన్నింగ్స్ తనకు అనుకున్నంత సంతృప్తి ఇవ్వలేదని, కానీ సానుకూల దృక్పథంతో ముందుకెళ్తానని చెప్పాడు. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత భవిష్యత్తులో అయ్యర్ టీమిండియా కెప్టెన్ అవుతాడనిపించిందని హాగ్ అన్నాడు. అతనిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, భవిష్యత్తులో భారత జట్టు సారధి అయ్యే అవకాశం ఉందని కొనియాడాడు.

ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రాడ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా ప్రకటించిన 15 మంది ఆటగాళ్ల జాబితాలో శ్రేయాస్ పేరు లేదు. స్టాండ్ బై ప్లేయర్‌గా అతన్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.