'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో వైఎస్ షర్మిల... సర్వత్రా ఆసక్తి!

24-09-2021 Fri 17:09
  • సెప్టెంబరు 26న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
  • రాత్రి 8.30 గంటలకు కార్యక్రమం
  • ఈసారి షర్మిలతో ఆర్కే ఇంటర్వ్యూ
  • ప్రోమో విడుదల
YS Sharmila attends Open Heart with RK

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ (ఆర్కే) పూర్వాశ్రమంలో రిపోర్టర్ అన్న సంగతి తెలిసిందే. ఓవైపు యాజమాన్య పరమైన వ్యవహారాలు చూసుకుంటున్నప్పటికీ అటు ఆంధ్రజ్యోతి దినపత్రికలోనూ, ఇటు ఏబీఎన్ చానల్లోనూ అనేక అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా ఆయన వెల్లడి చేస్తుంటారు.

ఇక 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంతో వేమూరి రాధాకృష్ణ అనేక రంగాలకు చెందిన ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ ఆ కార్యక్రమాన్ని మరింత ఎత్తులకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఈ ఆదివారం (సెప్టెంబరు 26) రాత్రి 8.30 గంటలకు ఓ విశిష్ట అతిథిని ఇంటర్వ్యూ చేయనున్నారు.

ఆ అతిథి ఎవరో కాదు... వైఎస్ షర్మిల. షర్మిల ఇటీవలే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణలో రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ నేపథ్యంలో షర్మిల 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమానికి రావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

గతంలో వైఎస్సార్ హయాంలోనూ, ఇప్పుడు జగన్ హయాంలోనూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అంటే వైఎస్ కుటుంబీకులకు వైరి వర్గం అన్న ముద్రపడింది. కానీ షర్మిల... 'ఓపెన్ హార్ట్...' కు హాజరవడం ద్వారా ఆ ముద్రను చెరిపివేసే ప్రయత్నం చేశారా? లేక తన పార్టీ బాణీని మరింత బలంగా వినిపించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారా? అనేది ఆసక్తి కలిగిస్తోంది.

తాజాగా ఏబీఎన్ చానల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఆర్కే ఎప్పట్లాగానే కొన్ని సీరియస్ ప్రశ్నలు, కొన్ని ఆహ్లాదకరమైన ప్రశ్నలు సంధించినట్టు ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఏదేమైనా షర్మిల'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమానికి హాజరు కావడం చర్చనీయాంశంగానే భావించాలి.