లండన్ లో సర్జరీ చేయించుకున్న హీరో సిద్ధార్థ్

24-09-2021 Fri 12:45
  • సిద్ధార్థ్ సర్జరీ చేయించుకున్నాడని తెలిపిన అజయ్ భూపతి
  • సమస్య ఏమిటో వెల్లడి కాని వైనం
  • సిద్ధార్థ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న అభిమానులు
Actor Siddharth undergone surgery
తమిళ సినీ హీరో సిద్ధార్థ్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో హిట్ అయ్యాయి. అయితే గత కొన్నేళ్లుగా తెలుగులో ఆఫర్లు తగ్గడంతో ఆయన పూర్తిగా తమిళ సినిమాలపైనే ఫోకస్ చేశాడు. ప్రస్తుతం శర్వానంద్ తో కలిసి సిద్ధార్థ్ నటించిన 'మహాసముద్రం' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దసరాకి ఈ చిత్రం విడుదల కానుంది.

ఇక ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ కు శర్వానంద్, హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్, దర్శకుడు అజయ్ భూపతితో పాటు సాంకేతిక నిపుణులందరూ హాజరయ్యారు. అయితే సిద్ధార్థ్ మాత్రం హాజరుకాలేదు. దీంతో, సిద్ధార్థ్ ఎందుకు రాలేదనే అనుమానాలను అభిమానులు వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ రాకపోవడానికి కారణమేంటో ఇప్పుడు వెల్లడైంది.

ప్రస్తుతం సిద్ధార్థ్ లండన్ లో ఉన్నాడు. అక్కడి ఓ హాస్పిటల్ లో చిన్న సర్జరీ చేయించుకున్నాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి కూడా వెల్లడించారు. అయితే, సిద్ధూకు వచ్చిన సమస్య ఏమిటి? ఏ సర్జరీ చేయించుకున్నాడనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. సోషల్ మీడియలో ఎంతో యాక్టివ్ గా ఉండే సిద్ధార్థ్ కూడా తన సర్జరీ విషయంపై ఇంత వరకు ఎలాంటి వివరాలు ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపు విషయం తెలుసుకున్న అభిమానులు మాత్రం... ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.