విజయవాడలో దుకాణం తెరిచి... టన్నుల టన్నుల హెరాయిన్ ఎక్కడకు పంపిస్తున్నారు?: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి

24-09-2021 Fri 12:17
  • డ్రగ్స్ వ్యాపారానికి డీజీపీని అడ్డుపెట్టుకున్నారు
  • వైన్ షాపుల్లో క్యాష్ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు?
  • డ్రగ్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తున్నావో బయటపెడతాం
TDP leader Pattabhi asks Jagan about Drugus
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ప్రశ్నల వర్షం కురిపించారు. విజయవాడ నడిబొడ్డులో దుకాణం తెరిచి... అక్కడి నుంచి టన్నుల టన్నుల హెరాయిన్ ను ఎక్కడకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. ఈ మత్తు పదార్థాలను ఎక్కడి నుంచి కొంటున్నారని అడిగారు. ఎలాంటి విచారణ జరపకుండానే హెరాయిన్ విషయంలో క్లీన్ చిట్ ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్గాంధ్రప్రదేశ్ గా మార్చారని దుయ్యబట్టారు. మాదకద్రవ్యాలకు రాష్ట్రాన్ని కేరాఫ్ అడ్రస్ గా  మార్చారని అన్నారు. డ్రగ్స్ వ్యాపారానికి తోలుబొమ్మలాంటి డీజీపీని అడ్డుపెట్టుకున్నారని ఆరోపించారు.

వైన్ షాపుల్లో కేవలం క్యాష్ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. మద్యం షాపుల్లో ఫోన్ పే, గూగుల్ పే వంటి పేమెంట్ ఆప్షన్లు కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ డాన్ జగన్ అంటూ మండిపడ్డారు. దమ్ముంటే రేపటి నుంచే అన్ని రంగాల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లను అందుబాటులోకి తీసుకురావాలని సవాల్ విసిరారు. వైన్ షాపుల్లో క్యాష్ మాత్రమే తీసుకుంటూ బ్లాక్ మనీ ఎలా సందపాదిస్తున్నావో బయటపెడతామని అన్నారు. రాష్ట్రంలో పోర్టులన్నింటినీ హస్తగతం చేసుకుని, డ్రగ్స్ ద్వారా వేల కోట్లు ఎలా సంపాదిస్తున్నావో ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు.