'సర్కారువారి పాట' కోసం మహేశ్ పారితోషికం 50 కోట్లు?

24-09-2021 Fri 10:49
  • షూటింగు దశలో 'సర్కారువారి పాట'
  • డిఫరెంట్ లుక్ తో మహేశ్ బాబు
  • బ్యాంకు స్కామ్ చుట్టూ తిరిగే కథ
  • జనవరి 13వ తేదీన విడుదల    
Sarkaru Vaari Paata movie update
టాలీవుడ్లో మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కొంతకాలంగా ఆయన వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది.

పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు మహేశ్ బాబు అందుకుంటున్న పారితోషికం 50 కోట్లకు చేరిందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోల కేటగిరిలో కనిపిస్తున్న వాళ్లంతా ఇంచుమించు ఇదే స్థాయి పారితోషికాన్ని తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు.

ఈ కథ అంతా కూడా భారీ స్థాయిలో జరిగిన ఒక బ్యాంక్ స్కామ్ చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. డిఫరెంట్ లుక్ తో మహేశ్ బాబు కనిపిస్తున్న ఈ సినిమాను, 'సంక్రాంతి' పండుగ సందర్భంగా, జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు.