పంచె జారిపోతోంది.. అసెంబ్లీలో సిద్ధరామయ్య చెవిలో చెప్పిన డీకే శివకుమార్

  • మైసూరు గ్యాంగ్‌రేప్‌పై సీరియస్‌గా ప్రసంగిస్తుండగా ఘటన
  • పంచె సరిగా కట్టుకున్న తర్వాతే మాట్లాడతానన్న సిద్ధరామయ్య
  • కరోనా నుంచి కోలుకున్న తర్వాత పొట్ట సైజ్ పెరిగిందంటూ చమత్కారం
Siddaramaiahs dhoti comes off during heated debate in Karnataka assembly

కర్ణాటక అసెంబ్లీలో నిన్న నవ్వులు పూయించే ఘటన ఒకటి జరిగింది. మైసూరులో ఇటీవల జరిగిన సామూహిక అత్యాచారంపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీరియస్‌గా ప్రసంగిస్తున్నారు. అంతలో కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్ ఆయన వద్దకు వచ్చి చెవిలో ఏదో చెప్పారు. దీంతో ‘అవునా’ అంటూ సిద్ధరామయ్య వెంటనే కుర్చీలో కూర్చున్నారు.

 ఇంతకీ సిద్ధరామయ్య చెవిలో డీకే ఏం చెప్పారో తెలుసా? ‘‘మీ పంచె (ధోతీ) జారిపోతోంది.. సరిగా కట్టుకోండి’’ అని. ఆ మాట విన్నవెంటనే సిద్ధరామయ్య వెంటనే కుర్చీలో కూర్చుంటూ పంచె సరిగా కట్టుకున్న తర్వాత మాట్లాడతానని సభకు చెప్పడంతో అందరూ చిరునవ్వులు చిందించారు.

సిద్ధరామయ్య ఆ మాట అనగానే స్పీకర్ స్థానంలో ఉన్న కుమార్ బంగారప్ప స్పందిస్తూ.. ‘‘సమస్య ఏంటో మీరే చెబితే వినడానికి బాగుంటుంది’’ అన్నారు. ఆ తర్వాత ధోతీ బిగించి కట్టుకున్న సిద్ధరామయ్య లేచి మాట్లాడుతూ.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత నాలుగైదు కిలోల బరువు పెరిగానని, దీంతో పొట్టపరిమాణం పెరగడంతో పంచె జారిపోతోందని చమత్కారంగా చెప్పారు.

దీంతో ట్రెజరీ వైపు నుంచి సాయానికి ఒకరు ముందుకు రాగా, మీరు అవతలి వైపు పార్టీ వారు కనుక సాయం తీసుకోబోనని చెప్పారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ మాట్లాడుతూ సిద్ధరామయ్య పంచె ఊడిపోతోందన్న విషయం గుర్తించిన తమ పార్టీ అధ్యక్షుడు శివకుమార్ ఆయన పరువును, పార్టీ పరువును కాపాడేందుకు నెమ్మదిగా చెవిలో చెబితే ఆయనేమో (సిద్దరామయ్య) ఆ విషయాన్ని సభలో బయటపెట్టేశారని చెప్పడంతో సభ్యులందరూ ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. ఇప్పుడీ విషయాన్ని బీజేపీ తమను ఇరుకున పెట్టేందుకు వాడుకుంటుందని చెప్పడంతో సభలో మరోమారు నవ్వులు విరిశాయి.

More Telugu News