IAS Srilaxmi: జగన్ అక్రమాస్తుల కేసు: ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి నాన్ బెయిలబుల్ వారెంట్

Non Bailable Warrant against IAS Officer Srilakshmi
  • ఓబుళాపురం కేసులోనూ చుక్కెదురు
  • శ్రీలక్ష్మి క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
  • వాన్‌పిక్ కేసులో ఎంపీ మోపిదేవి, బ్రహ్మానందరెడ్డిల తరపు న్యాయవాదుల డుమ్మా
  • ఈసారి రాకుంటే బాగుండదని హెచ్చరించిన కోర్టు
దాల్మియా సిమెంట్స్ కేసులో తరచూ గైర్హాజరవుతున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నాంపల్లిలోని ఈడీ, సీబీఐ ప్రత్యేక కోర్టులో నిన్న ఈ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా విచారణకు తరచూ గైర్హాజరవుతున్న శ్రీలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

మరోవైపు, ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులోనూ శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. ఈ కేసులో శ్రీలక్ష్మి ఏ6 నిందితురాలిగా ఉన్నారు. సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టులో గతేడాది క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం..ఆ పిటిషన్‌ను కొట్టేసింది. నిబంధనలు ఉల్లంఘించి మరీ మైనింగ్ లీజు ఇచ్చారని, నిందితులతో కుమ్మక్కు కావడం ద్వారా ప్రభుత్వాన్ని మోసగించారన్న అభియోగాలు ఉన్నాయని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. క్వాష్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్టు పేర్కొంది. అలాగే, గతంలో పిటిషనర్‌కు అనుకూలంగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సైతం ఎత్తేస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.

ఇదిలావుంచితే, రాంకీ కేసులో విచారణకు హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి.వెంకట్రామిరెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కాలేకపోయానని, తనపై గతంలో జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను కొట్టివేయాలని కోరారు. స్పందించిన కోర్టు దానిని కొట్టివేసింది. వాన్‌పిక్ కేసులో ఎంపీ మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డిల తరపున న్యాయవాదుల హాజరుకు హైకోర్టు అనుమతించినా వారు కూడా డుమ్మా కొట్టడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసిన కోర్టు.. ఈసారి విచారణకు రాకుంటే తగిన ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది.

IAS Srilaxmi
Obulapuram Mining
High Court
Jagan
CBI
Disproportionate Assets Case

More Telugu News