ఈ 6 రాష్ట్రాల్లో 10 వేలకుపైగా కరోనా యాక్టివ్ కేసులు: కేంద్ర ఆరోగ్యశాఖ

23-09-2021 Thu 22:13
  • జాబితా విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
  • జాబితాలో నాలుగు దక్షిణాది రాష్ట్రాలే
  • అత్యధికంగా కేరళలో 1.6 లక్షలపైగా యాక్టివ్ కేసులు
Centre releases 6 states with more than 10 thousand active cases

ప్రస్తుతం దేశంలో అత్యధికంగా కరోనా కేసులు ఉన్న రాష్ట్రాల జాబితాను కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ముఖ్యంగా 6 రాష్ట్రాల్లో 10 వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఈ జాబితాలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, మిజోరాం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఉన్నాయి. వీటిలో నాలుగు దక్షిణాది రాష్ట్రాలే కావడం గమనార్హం. వీటిలో దేశంలోని యాక్టివ్ కేసుల్లో 53.57 శాతం కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

కేరళలో మొత్తం 1,61,596 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధిక యాక్టివ్ కేసులున్న రాష్ట్రాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్రలో 43,544 కేసులుండగా, తమిళనాడులో 17,027, మిజోరాంలో 15,638, ఆంధ్రప్రదేశ్‌లో 13,796, కర్ణాటకలో 13,650 కేసులు ఉన్నట్లు ఈ నివేదిక తెలుపుతోంది. కాగా, ఈ రోజు కొత్తగా 31,923 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన వారం రోజుల్లో దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 62.73 శాతం కేరళ నుంచే వచ్చినట్లు కేంద్రం పేర్కొంది.