విమానంలో కూడా మోదీ బిజీ.. లాల్ బహదూర్ శాస్త్రితో పోలిక తెచ్చిన బీజేపీ నేత!

23-09-2021 Thu 21:11
  • అమెరికా పర్యటన, క్వాడ్ నేతల సమావేశం, యూఎస్‌లో ప్రసంగంతో బిజీ షెడ్యూల్
  • బోయింగ్ విమానంలో ప్రయాణిస్తూ పర్యటన పేపర్స్ చెక్ చేసుకున్న మోదీ
  • ఫోటో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్
Modi busy on flight to US photo goes viral

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేసినా నెట్టింట్లో వైరల్ అవుతుంటుంది. ఇదిగో ఇప్పుడు కూడా అమెరికా వెళ్తూ విమానంలో నుంచి ఆయన షేర్ చేసిన ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. బోయింగ్ విమానంలో తన పర్యటనకు సంబంధించిన పత్రాలను ఆయన చెక్ చేసుకుంటున్నారీ ఫొటోలో. ‘లాంగ్ జర్నీ అంటే పనికి సంబంధించిన పత్రాలు పరిశీలించే అవకాశం ఉంది కదా’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.

ఈ ఫోటోపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెంటనే స్పందించారు. ‘నిరంతరం దేశ సేవలోనే’ అంటూ కామెంట్ చేశారు. అదే సమయంలో మరో బీజేపీ నేత కపిల్ మిశ్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఇలాగే విమానంలో పనికి సంబంధించిన పత్రాలు పరిశీలిస్తున్న ఫొటోను షేర్ చేశారు. ఇద్దరూ ఇలా విమానాల్లో కూడా బిజీగా ఉన్నారని అన్నారు.

అయితే బీజేపీ నేతల తీరును కొందరు విమర్శిస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా విమానంలో ఫైల్స్ చెక్ చేస్తున్న ఫొటోను షేర్ చేసిన మాజీ ఎంపీ షాహిద్ సిద్దిఖీ ఒక ట్వీట్ చేశారు. ‘‘నేను చాలామంది ప్రధానులతో కలిసి ప్రయాణించాను. అందరూ ఇదే పని చేస్తారు. కానీ బీజేపీకి మాత్రం అన్నీ మొదటి సారే. వీళ్లకు 2014 ముందు అసలు భారతదేశమే లేనట్లు కనిపిస్తుంది’’ అంటూ ఘాటుగా బదులిచ్చారు.

కాగా, అమెరికా పర్యటనలో మోదీకి ఘనస్వాగతం లభించింది. పలువురు ఎన్నారైలు విమానాశ్రయానికి చేరుకొని త్రివర్ణ పతాకాలు గాల్లో ఊపుతూ మోదీకి స్వాగతం పలికారు.