Congress: కరోనా మృతుల కుటుంబాలకు 5 లక్షలు ఇవ్వాలి: కాంగ్రెస్ డిమాండ్

  • సుప్రీంకోర్టు జోక్యంతో రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటన
  • కేంద్రం ప్రకటన ఒక జోక్ అంటూ మండిపడిన కాంగ్రెస్
  • కరోనాను విపత్తుగా గుర్తిస్తే కుటుంబానికి రూ. 4 లక్షలు ఇవ్వాలి
  • అందుకే మహమ్మారిని విపత్తుగా గుర్తించడం లేదంటూ చురకలు
Congress demands 5 lakh for covid death

కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కాంగ్రెస్ మరోసారి మండిపడింది. కరోనా మృతుల కుటుంబాలకు కేంద్రం ప్రకటించిన రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియాను ఒక జోక్ అంటూ విమర్శించింది. కరోనా కారణంగా చాలా మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయారని, అలాగే అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రతినిధి సుప్రియా శ్రీనాటే అన్నారు. కాబట్టి రూ. 50 వేలు కాకుండా ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఆమె డిమాండ్ చేశారు.

‘‘కరోనా మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఆర్థిక సాయం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎందుకంటే అనేకమంది పిల్లలు ఈ మహమ్మారి వల్ల తల్లిదండ్రులను కోల్పోయారు. అదే సమయంలో చాలా మంది నిరుద్యోగులుగా మారారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా ఒక జోక్ మాత్రమే’’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా మృతులకు 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం కోరుతూ ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో కొంతకాలం క్రితం ఇక పిటిషన్ వేశారు. జూన్ 30న దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో జాతీయ విపత్తు నిర్వహణ శాఖ తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీనికోసం కేంద్రానికి ఆరువారాల గడువునిచ్చింది. ఆ తర్వాత ఈ గడువును మరో రెండు వారాలకు పొడిగించింది.

ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించింది. దీనిపై కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా విమర్శలు గుప్పించారు. కరోనా మహమ్మారిని విపత్తు (డిజాస్టర్‌)గా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదని ఆమె అన్నారు. ఇలా గుర్తిస్తే మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని, అందుకే కేంద్రం ఈ మహమ్మారిని విపత్తుగా గుర్తించడం లేదని సుప్రియ పేర్కొన్నారు.

More Telugu News