Central Government: తాను వాడిన మాస్కును వేరొకరికి ఇచ్చిన కేంద్ర మంత్రి!

  • బహిరంగ సభకు వచ్చిన పౌరవిమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
  • ఆయన్ను కలిసిన మాజీ ఎంపీ అరుణ్ మిశ్రా
  • తాను ధరించిన రెండు మాస్కుల్లో ఒకటి తీసిచ్చిన మంత్రి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Central minister gives his used mask to former MP

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. గ్వాలియర్‌లో ఒక బహిరంగ సభలో పాల్గొనేందుకు సింధియా వచ్చారు. ఆ సమయంలో గ్వాలియర్ మాజీ ఎంపీ అరుణ్ మిశ్రా కూడా అక్కడ ఉన్నారు. సింధియాను ఆయన ఆహ్వానించారు. ఆ సమయంలో మిశ్రా మాస్కు ధరించలేదు. దీన్ని సింధియా గమనించారు.

గ్వాలియర్ వచ్చే సమయంలో సింధియా రెండు మాస్కులు ధరించి ఉన్నారు. ఒక ఎన్95 మాస్కు, దానిపై ఒక సర్జికల్ మాస్కు వేసుకున్నారు. మిశ్రాకు మాస్కు లేకపోవడం చూసిన సింధియా.. తాను ధరించిన సర్జికల్ మాస్కు తీసి మిశ్రాకు తొడిగారు. ఈ ఘటనను అక్కడ ఉన్న ఒక వ్యక్తి తన కెమెరాలో రికార్డు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనాతో పోరాటంపై కోట్లు ఖర్చు పెడుతున్నట్లు చెబుతోందని, వారి మంత్రులు మాత్రం ఇలా వాడేసిన మాస్కులు పంచుతూ తిరుగుతున్నారని విమర్శలు చేస్తున్నారు.

కాగా, భారత్‌లో ఇప్పటికే ప్రతిరోజూ 25 వేల నుంచి 30 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా పోలేదని, కాబట్టి కరోనా నిబంధనలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు అమలు చేయాలని చెబుతోంది.

More Telugu News