వ్యాక్సినేషన్ కాదు సమస్య.. భారత్ లో ఇంకా కరోనా కేసులు ఉండడమే: బ్రిటన్ హైకమిషనర్

23-09-2021 Thu 14:40
  • తక్కువ కేసులున్న దేశాలే గ్రీన్ లిస్టులో
  • భారత్ యాంబర్ లిస్టులో ఉంది
  • కొవిన్ యాప్ పై ఎలాంటి అనుమానాలూ లేవు
British High Commissioner Says they Dont Doubt India Vaccination But It Has Some Covid

భారత్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమంపైగానీ, కొవిన్ యాప్ పై గానీ తమకు ఎలాంటి అనుమానాలు లేవని భారత్ లో బ్రిటన్ హైకమిషనర్ అలెక్స్ ఎలిస్ చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఇంకా కరోనా కేసులు ఉండడం వల్లే క్వారంటైన్ ను తప్పనిసరి చేశామని అన్నారు. భారత్ కు క్వారంటైన్ రూల్స్ పై రెండు రోజులుగా వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆయన స్పందించారు. భారత్ గ్రీన్ జాబితాలో లేదు కదా? అని ఆయన ప్రశ్నించారు. చాలా తక్కువ కేసులున్న దేశాలనే గ్రీన్ లిస్ట్ లో పెట్టామని, భారత్ ఇప్పుడు యాంబర్ లిస్టులో ఉందని చెప్పారు.

కొవిన్ యాప్ పై తమకు సందేహాలు లేవని ఎలిస్ తెలిపారు. బ్రిటన్ ఎన్ హెచ్ఎస్ యాప్ తయారీదారులు, కొవిన్ యాప్ రూపకర్తలతో కొన్ని వారాలుగా చర్చిస్తూనే ఉన్నామని ఆయన వెల్లడించారు. రెండు దేశాల మధ్య ప్రజల రాకపోకలు సాగుతున్నాయని, అలాంటప్పుడు బ్రిటన్ నుంచి భారత్ కు, భారత్ వల్ల బ్రిటన్ కు ముప్పు ఉండకూడదనే క్వారంటైన్ నిబంధనలను అమలు చేస్తున్నామని వివరించారు.

ఈ ఏడాది 62,500 మంది విద్యార్థులకు వీసాలు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 30 శాతం అదనమని తెలిపారు.