ఆంధ్రా యూనివర్సిటీలో 'అమెరికన్ కార్నర్' ను ప్రారంభించిన సీఎం జగన్

23-09-2021 Thu 14:21
  • అమెరికాలో విద్య, ఉద్యోగ సమాచారం కోసం ప్రత్యేక విభాగం
  • ఇప్పటిదాకా హైదరాబాద్, అహ్మదాబాద్ లోనే ఉన్న 'కార్నర్'
  • ఇప్పుడు ఏపీలోనూ 'అమెరికన్ కార్నర్'
  • సంతోషం వ్యక్తం చేసిన సీఎం జగన్
CM Jagan inaugurates American Corner at Andhra University

అగ్రరాజ్యం అమెరికాలో విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల సమాచారం అందించే 'అమెరికన్ కార్నర్' ను ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీలోనూ నెలకొల్పారు. ఏయూలో ఏర్పాటుచేసిన ఈ 'అమెరికన్ కార్నర్' ను   ఏపీ సీఎం జగన్ నేడు ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఆయన ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, విద్యార్థులకు ఉన్నతమైన అవకాశాలు లభించడంలో 'అమెరికన్ కార్నర్' ఎంతో సౌలభ్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఇప్పటివరకు హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాల్లోనే 'అమెరికన్ కార్నర్' లు ఉన్నాయని, ఇప్పుడు ఏపీలోనూ ఏర్పాటు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో ఏయూ వైస్ చాన్సలర్ ప్రసాద్ రెడ్డి, అమెరికన్ కాన్సులేట్ జనరల్ అధికారులు, మిషన్ డైరెక్టర్ వీణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.