యువతి కిడ్నాప్.. అత్యాచార యత్నం.. ప్రతిఘటించడంతో కళ్లలో యాసిడ్ పోసిన దుండగులు

23-09-2021 Thu 13:35
  • తమ బంధువు పారిపోవడానికి సాయం చేసిందని ఘాతుకం
  • మధ్యప్రదేశ్ లోని బరాహో గ్రామంలో దారుణం
  •  బాధితురాలి సోదరుడిపైనా దాడి
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
2 men kidnap woman tries to rape her pour acid in eyes

ఓ యువతిని కిడ్నాప్ చేసిన ఇద్దరు వ్యక్తులు.. ఆమెపై అత్యాచారం చేయబోయారు. యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెపై దాడి చేశారు. కళ్లలో యాసిడ్ పోశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలోని బరాహో గ్రామంలో జరిగింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆ కేసు వివరాలను జిల్లా ఎస్పీ ధర్మరాజ్ మీనా వెల్లడించారు.

తమ ఇంట్లోని అమ్మాయి వేరే అబ్బాయితో పారిపోయేందుకు సహకరించిందన్న అనుమానంతో ఆ యువతిని, ఆమె సోదరుడిని నిందితులు కిడ్నాప్ చేశారు. అయితే, ఎంతకీ ఆమె వారి వివరాలను చెప్పలేదన్న కోపంతో బాధితురాలిని, ఆమె సోదరుడిని చితకబాదారు. యువతిపై అత్యాచారానికి ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో కళ్లలో యాసిడ్ పోశారు.

బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా నిందితులను సుమేర్ సింగ్, గోల్డీ రాజాగా గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. నిందితులిద్దరినీ పోలీసులు గ్రామంలో అందరూ చూసేలా నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా, స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం బాధితురాలిని చిత్రకూట్ లోని ఓ కంటి ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు.