Karnataka: 'స్టార్ట‌ప్‌'ల ర్యాంకుల్లో అద‌ర‌హో అనిపించిన బెంగ‌ళూరు!

  • ‘స్టార్టప్‌ జీనోమ్‌’ సంస్థ వెల్ల‌డి
  • ‘గ్లోబల్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ రిపోర్ట్‌ 2021’లో దేశంలో బెంగ‌ళూరు నం.1
  • ప్ర‌పంచంలో 23వ స్థానం
  • ఢిల్లీ, ముంబైకు సంయుక్తంగా 36వ ర్యాంకు
Bangalore number 1 in startups

‘స్టార్టప్‌ జీనోమ్‌’ సంస్థ ప్ర‌క‌టించిన ‘గ్లోబల్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ రిపోర్ట్‌ 2021’లో క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు స‌త్తా చాటింది. స్టార్ట‌ప్‌ల‌కు అనువైన న‌గ‌రాల జాబితాలో 23వ ర్యాంకు సాధించింది. దేశంలోనే మొద‌టి స్థానంలో నిలిచింది. భార‌త్ నుంచి ఆ త‌ర్వాత ఢిల్లీ, ముంబై  సంయుక్తంగా 36వ ర్యాంకులో నిలిచాయి.

స్టార్ట‌ప్‌ల‌కు నిధుల స‌హ‌కారం,  విజ్ఞానం వంటి అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ‘స్టార్టప్‌ జీనోమ్‌’ సంస్థ ఈ ర్యాంకుల‌ను ప్ర‌క‌టించింది. 2021 ఆగస్ట్‌ నాటికి ప్ర‌పంచ వ్యాప్తంగా స్టార్ట‌ప్‌ల‌కు అందుతోన్న ప్రోత్సాహకాల‌ను ఆ సంస్థ ప‌రిశీలించింది. భారత్‌లో ఈ ఏడాది ఆగ‌స్టు వ‌ర‌కు 24 యూనికార్న్‌లు అవతరించాయని దాని ద్వారా వెల్ల‌డైంది.

అందులో ఆరు యూనికార్న్‌లు ఏప్రిల్‌లో కేవలం నాలుగు రోజుల వ్య‌వ‌ధిలోనే అవ‌త‌రించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, బెంగళూరు ప్రపంచంలో నాలుగో అతిపెద్ద సాంకేతిక‌, ఆవిష్కరణల క్లస్టర్‌గా జాబితాలో నిలిచి స‌త్తా చాటింది. ఆ న‌గ‌రంలో 400కు పైగా ప్రపంచస్థాయి పరిశోధన, అభివృద్ధి  కేంద్రాలు ఉన్నాయి.

ఇక ముంబై, చెన్నై, పూణె, హైదరాబాద్ సైతం టాప్‌ 100 ఎమర్జింగ్‌ ఎకో సిస్టమ్స్‌లో స్టార్టప్‌ హబ్‌ల జాబితాలో నిలిచాయి. మ‌రోవైపు, ఈ ఏడాదికి గాను 25 సంస్థలతో లింక్డ్‌ఇన్ సంస్థ   వార్షిక స్టార్టప్స్‌ జాబితాను రూపొందించగా స్టార్టప్ సంస్థ‌ల జాబితాలో లెర్నింగ్‌ ప్లాట్‌ఫాం అన్‌అకాడెమీ టాప్‌-1లో ఉంది. 3.44 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌తో అన్‌అకాడెమీ ఈ జాబితాలో టాప్‌-1లో నిలిచింద‌ని వివ‌రించింది.

ఆ త‌ర్వాతి స్థానాలలో బీ2బీ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఉడాన్ ఉండ‌గా, మూడ‌వ స్థానంలో ఫైనాన్షియల్‌ టెక్నాలజీ స్టార్ట‌ప్‌ సంస్థ క్రెడ్ నిలిచింది. ఆ త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా అప్‌గ్రేడ్‌, రేజర్‌పే, మీషో, స్కైరూట్‌ ఏరోస్పేస్‌, బోట్‌ , అర్బన్‌ కంపెనీ, అగ్నికుల్‌ కాస్మోస్ నిలిచాయి. ఈ జాబితాలో ఉన్న 60 శాతం అంకుర సంస్థలు బెంగళూరుకు చెందినవే.

More Telugu News