Narendra Modi: ఇందిరాపార్క్ వద్ద ప్రతిపక్షాల మహాధర్నా.. మహా ప్రజా ఉద్యమం మొదలైందన్న సీతారాం ఏచూరి

  • ప్రధాని మోదీని గద్దె దించేంత వరకు ఉద్యమం కొనసాగుతుంది
  • రైతుల ఆందోళనపై స్పందించే తీరిక మోదీకి లేదు
  • పోడు రాస్తారోకోలో పాల్గొంటా : రేవంత్
  • దేశ రాజకీయాల్లో ఈ ధర్నా కీలక మలుపు: సీపీఐ నారాయణ
  • కేసీఆర్ మరో నిజాంలా వ్యవహరిస్తున్నారు: చాడ
Sitaram Yechury and other leader fires on modi and kcr

దేశాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా మహా ప్రజా ఉద్యమం మొదలైందని, ప్రధాని మోదీని గద్దె దించేంత వరకు అది కొనసాగుతుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త కార్యాచరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ప్రతిపక్షాలు నిన్న మహాధర్నా నిర్వహించాయి.

ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీపై తీవ్రస్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని నిర్వీర్యం చేసిన మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థను కూడా దారుణంగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ బర్త్ డే నాడు రెండు కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇచ్చామని చెబుతున్నారని, మరి ఆ తర్వాత ఆ స్థాయిలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రైతుల ఆందోళనలపై స్పందించే తీరికలేని ప్రధానికి విదేశీ పర్యటనలకు మాత్రం బోల్డంత సమయం దొరుకుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ధరణి, మల్లన్నసాగర్, ఫార్మాసిటీ భూ నిర్వాసితుల సమస్యలపై, పోడు భూముల హక్కులపై ఉద్యమించాలన్నారు. అక్టోబరు 5న నిర్వహించే పోడు రాస్తారోకోలో భద్రాచలం వద్ద తాను పాల్గొంటానని రేవంత్ తెలిపారు. దేశ రాజకీయాల్లో ఈ మహాధర్నా కీలక మలుపు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రూ. 3 లక్షల కోట్ల విలువ చేసే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రూ. 30 వేల కోట్లకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ ఇంటిపై దాడిని అఖిలపక్షం తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.

పోడు భూముల హక్కుల సాధన ఉద్యమం మోదీ ప్రభుత్వంపై ప్రజా యుద్ధంలా ఉండాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేసీఆర్ మరో నిజాంలా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీఎం ఒక్కరే ప్రగతి భవన్‌లో ఉంటే ప్రతిపక్షాలన్నీ ఇందిరాపార్క్ వద్ద ఉన్నాయని టీజేఎస్ నేత కోదండరాం దుయ్యబట్టారు. కాగా, ఈ ధర్నాలో సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు, ప్రజాసంఘాల రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.

More Telugu News