దివ్యాంగురాలిపై వైసీపీ నేత అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితుడు

23-09-2021 Thu 07:58
  • ఇంటిబయట కాపుకాసి నోరు నొక్కి అత్యాచారం
  • విశాఖ జిల్లా సీలేరులో ఘటన
  • వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు బాధితురాలి తరలింపు
Ysrcp leader raped disabled woman in visakha dist

విశాఖపట్టణం జిల్లాలో దారుణం జరిగింది. వైసీపీ గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు ఒకరు దివ్యాంగురాలిపై అత్యాచారానికి ఒడి గట్టాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని గూడెంకొత్తవీధి మండలంలో సీలేరుకు చెందిన 30 ఏళ్ల దివ్యాంగురాలికి వివాహమైన కొన్ని రోజులకే భర్త వదిలి వెళ్లిపోవడంతో తల్లివద్ద ఉంటోంది. వారం రోజుల క్రితం ఆమె తమ్ముడు అనారోగ్యం పాలు కావడంతో కుమారుడిని తల్లి విజయనగరం తీసుకెళ్లింది. దీంతో బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది.

ఈ క్రమంలో, సోమవారం అర్ధరాత్రి ఇంటి బయట ఉన్న మరుగుదొడ్డి కోసం ఆమె బయటకురాగా, అక్కడే కాపుకాసిన వైసీపీ నేత నాళ్ల వెంకటరావు ఆమెపై దాడికి దిగాడు. ఆపై చున్నీతో ఆమె నోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను బెదిరించి పరారయ్యాడు. బాధితురాలి తల్లి నిన్న విజయనగరం నుంచి ఇంటికి రాగా విషయం చెప్పింది. ఇద్దరూ కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం వైజాగ్ కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.