శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటే.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా కరోనా నెగటివ్ రిపోర్ట్ ఉండాల్సిందే!

23-09-2021 Thu 07:34
  • రెండు డోసులు వేయించుకున్న వారికి మాత్రమే అనుమతి
  • లేదా మూడు రోజుల ముందు చేయించుకున్న కరోనా నెగటివ్ రిపోర్టు ఉండాలి 
  • రేపటి నుంచి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
TTD Tighten Rules to Devotees

కరోనా నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆంక్షలు విధించింది. ఇకపై కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న వారికే స్వామి దర్శనభాగ్యం లభించనుంది. వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్ కానీ, దర్శనానికి మూడు రోజులు ముందు చేయించుకున్న కరోనా పరీక్ష నెగటివ్ సర్టిఫికెట్ కానీ ఉంటేనే దర్శనానికి అనుమతి ఇస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు 8 వేల టోకెన్లు విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా వారికి మాత్రమే రోజుకు 2 వేల టోకెన్లు జారీ చేస్తుండగా, వీటిని 8 వేలకు పెంచాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన తర్వాత తిరుపతిలో ఆఫ్‌లైన్ ద్వారా ఇస్తున్న టోకెన్లను నిలిపివేయనున్నారు. అలాగే, అక్టోబరు నెలకు సంబంధించి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రేపు ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.