ఏపీలో ప్రభుత్వ పాఠశాలల తల్లిదండ్రుల కమిటీల ఎన్నికలు.. టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడులు

23-09-2021 Thu 07:16
  • రణరంగాన్ని తలపించిన ఎన్నికలు
  • విశాఖ జిల్లా గుడ్డిబా ప్రాథమికోన్నత పాఠశాల చైర్మన్ పదవి రూ. 1.60 లక్షలకు వేలం
  • పలు చోట్ల ఎన్నికలు వాయిదా
  • ఎన్నికలు 94.91 శాతం పూర్తయ్యాయన్న మంత్రి ఆదిమూలపు
Attacks between ysrcp and tdp in School Committee elections in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల తల్లిదండ్రుల కమిటీకి నిన్న నిర్వహించిన ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. చాలాచోట్ల వైసీపీ-టీడీపీ వర్గీయులు పరస్పర రాళ్లదాడికి దిగారు. కొన్ని చోట్ల వైసీపీలోనే రెండు వర్గాలు కలబడ్డాయి. మరికొన్ని చోట్ల బీజేపీ కూడా జతకలిసింది. దీంతో ఉద్రిక్తతలు ఉన్నచోట ఎన్నికలను వాయిదా వేశారు.

విశాఖపట్టణం జిల్లా రావికమతం మండలంలోని గుడ్డిబా ప్రాథమికోన్నత పాఠశాల చైర్మన్ పదవిని రూ. 1.60 లక్షలకు వేలం వేశారు. ఈ పాఠశాలలో ‘నాడు-నేడు’ కింద  కోట్ల రూపాయల విలువ చేసే పనులను తల్లిదండ్రుల కమిటీ ద్వారా చేస్తుండడంతో ఈ పదవికి గిరాకీ ఏర్పడింది. చివరికి ఓ వ్యక్తి వేలంలో ఈ పదవిని కొనుక్కున్నారు. కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో పూర్తిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.

వైసీపీ, టీడీపీ వర్గాలు బాహాబాహీకి దిగి రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. దీంతో ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. కడప జిల్లా వీరపల్లె మండలంలోని ఉప్పరపల్లె, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి, విశాఖ జిల్లా గణపర్తి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల కమిటీ, గుంటూరు జిల్లాలో 160 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.

మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు 94.91 శాతం పూర్తయ్యాయని, మొత్తం 46,609 స్కూళ్లకు ఎన్నికలు నిర్వహించగా 44,237 పాఠశాలల్లో ఎన్నికలు పూర్తయినట్టు చెప్పారు. అలాగే, 19 వేల పాఠశాలల్లో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు చెప్పారు.