కరోనా మృతుల కుటుంబాలకు 50 వేల ఎక్స్‌గ్రేషియా: సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

22-09-2021 Wed 22:35
  • సంబంధిత పత్రాలు సమర్పిస్తే నిధుల విడుదల
  • రాష్ట్రాల డిజాస్టర్ రిలీఫ్ ఫండ్స్ నుంచి అందనున్న పరిహారం
  • సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం
Center told SC that it will give Rs 50 thousand Ex gratia to each covid death

కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలంటూ గౌరవ్ కుమార్ బన్సాల్, రీపక్ కన్సాల్ అనే ఇద్దరు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ విషయంలో మార్గదర్శకాలు విడుదల చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మార్గదర్శకాల విడుదలకు ప్రధాన మంత్రి ఆధ్వర్యంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎమ్ఏ)కు 6 వారాల గడువిస్తున్నట్లు జూన్ 30న ప్రకటించింది. ఆగస్టు 16న మరో రెండు వారాల గడువిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే మార్గదర్శకాలను వివరిస్తూ ఎన్‌డీఎమ్‌ఏ అఫిడవిట్ దాఖలు చేసింది

కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు అందించాలని తాము నిర్ణయించినట్లు ఈ అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. బాధితులు మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరోనాతో మరణించినట్లు ధ్రువీకరణ తీసుకోవాలని సూచించింది. వీటిని జిల్లా విపత్తు నిర్వహణ సంస్థల్లో అందిస్తే ఎక్స్‌గ్రేషియా నిధులు వారి కుటుంబాలకు చేరతాయని కేంద్రం వివరించింది.

ఈ నిధులను ఆయా రాష్ట్రాల విపత్తు నిర్వహణా నిధుల నుంచి అందించనున్నట్లు పేర్కొంది. ఈ పరిహారం అందించే ప్రక్రియ మొత్తం జిల్లా విపత్తు నిర్వహణ సంస్థల ఆధ్వర్యంలోనే జరుగుతుందని తెలిపింది. ఈ ప్రక్రియ చాలా సులభతరంగా ఉంటుందని వివరించింది. అలాగే ఇప్పటికే కొందరు కరోనా పేషెంట్లకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు కొంత సహాయం అందించిన విషయాన్ని కూడా ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది.