టాలీవుడ్ డ్రగ్స్ కేసు: 7 గంటలపాటు సాగిన తరుణ్‌ విచారణ

22-09-2021 Wed 20:25
  • బుధవారం ఉదయం విచారణకు హాజరైన హీరో తరుణ్
  • డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో సంబంధాలపై ప్రశ్నలు
  • మనీలాండరింగ్ కోణంలోనూ సాగిన విచారణ
Hero Tarun ED interroagation lasts for 7 hours
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరో తరుణ్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం ఈడీ విచారణకు వచ్చిన తరుణ్‌ను అధికారులు రకరకాల కోణాల్లో విచారించారు. సుదీర్ఘంగా 7 గంటలపాటు తరుణ్ విచారణ సాగింది. ఈ కేసులో మొత్తం 12 మందికి ఈడీ నోటీసులు అందాయి. వారిలో పూరీ జగన్నాథ్, రానా, చార్మి, నవదీప్, రకుల్ ప్రీత్ సింగ్, రవితేజ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు.

మొత్తం 12 మందిలో ఇప్పటికే 11 మంది ఈడీ విచారణకు హాజరయ్యారు. వీరిపై సుదీర్ఘ విచారణ జరిపిన ఈడీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు సమాచారం. ఈ జాబితాలో చివరి వ్యక్తిగా ఈడీ విచారణకు తరుణ్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో తరుణ్‌కు ఉన్న సంబంధంపై అధికారులు విచారణ జరిపినట్లు తెలుస్తోంది. అలాగే మనీలాండరింగ్ కోణంలో కూడా ప్రశ్నించిన అధికారులు.. అనుమానాస్పదంగా ఉన్న బ్యాంకు లావాదేవీలపై తరుణ్‌ను ఆరా తీసినట్లు తెలుస్తోంది.