Maharashtra: బీజేపీ లేకపోతే ఇక అది తాలిబన్ ప్రభుత్వమేనా?: కాషాయ పార్టీ నేతలపై సంజయ్ రౌత్ ఫైర్

if there is not BJP government is that Taliban Raj asks Sanjay Raut
  • పశ్చిమ బెంగాల్‌లో తాలిబన్ ప్రభుత్వం ఉందన్న బీజేపీ కొత్త చీఫ్
  • గతంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని తాలిబన్లతో పోల్చిన మరో ఎంపీ
  • కేంద్రం వీరిపై చర్యలు తీసుకోవాలని కోరిన రౌత్
  • ఇది రాజకీయాలను దిగజార్చడమేనని వ్యాఖ్య
బీజేపీ నేతలపై శివసేన నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో సుకాంత మజుందార్‌ను పార్టీ చీఫ్‌గా బీజేపీ నియమించింది. ఆయన అలా పార్టీ పగ్గాలు చేపట్టారో లేదో అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. బెంగాల్‌లో తాలిబన్ రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను రౌత్ తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయాలను దిగజారుస్తాయని హితవు పలికారు.

‘‘దేశంలో బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాలు లేదా విపక్ష పార్టీలు పాలిస్తున్న ప్రాంతాల్లో తాలిబన్ రాజ్యం ఉన్నట్లుగా ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తాలిబన్ రాజ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదు. మమతా బెనర్జీ ప్రభుత్వం భారీ మెజార్టీతో ఎన్నికైంది. అంటే బెంగాల్ ప్రజలు తాలిబనీలా?’’ అని సంజయ్ రౌత్ దుయ్యబట్టారు.

ఈ రకంగా కామెంట్లు చేస్తుంటే ఆ రాజకీయాల స్థాయి ఏంటి? అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే నేతల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా రౌత్ తప్పుబట్టారు. మహారాష్ట్రలో తమ ప్రభుత్వాన్ని గతంలో ఒక కేంద్ర మంత్రి తాలిబన్ ప్రభుత్వంతో పోల్చారని, ఇప్పుడు ఒక ఎంపీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తాలిబన్ ప్రభుత్వం అన్నారని రౌత్ గుర్తుచేశారు.

ఇలాంటి వ్యక్తులపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ‘‘ఇటువంటి ప్రవర్తన ప్రభుత్వానికి ఆమోదయోగ్యమేనా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వంతో ఏదైనా రాష్ట్రం ఏకీభవించకపోతే ఇలాంటి భాష వాడతారా?’’ అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.
Maharashtra
Shiv Sena
West Bengal
Trinamool Congress
Mamata Banerjee
Sanjay Raut
BJP

More Telugu News