ఇలా ఓడిపోవడం పంజాబ్‌కు అలవాటుగా మారింది: కుంబ్లే

22-09-2021 Wed 17:45
  • ప్రస్తుతం పంజాబ్ హెడ్‌కోచ్‌గా ఉన్న కుంబ్లే
  • రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి తర్వాత స్పందన
  • స్వల్పతేడాలతో జట్టు ఓడిపోవడంపై అసంతృప్తి
Anil kumble responds on Punjab loses

చివరి ఓవర్లో 4 పరుగులు కావాలి. చేతిలో ఇంకా 8 వికెట్లు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో బ్యాటింగ్ జట్టు గెలవడం దాదాపు నల్లేరుపై నడకే. కానీ పంజాబ్ కింగ్స్ మాత్రం అనూహ్యంగా ఓటమిపాలైంది. రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఈ దృశ్యం కనిపించింది. క్రీజులో నికోలస్ పూర్, దీపక్ హుడా వంటి హిట్టర్లున్నప్పటికీ పంజాబ్ 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమి అనంతరం పంజాబ్ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఇలా స్వల్పతేడాలతో ఓడిపోవడం పంజాబ్ జట్టుకు అలవాటుగా మారిందని ఆయన అన్నాడు. ‘‘మ్యాచ్‌ను 19 ఓవర్లలోనే ముగించాలని నిర్ణయించుకున్నాం, కానీ ఆఖరి వరకూ సాగడంతో ఫలితం ఊహించడం కష్టంగా మారింది. చివరి ఓవర్ వేసిన కార్తీక్ త్యాగిని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఈ ఓటములపై ఫోకస్ పెట్టాలి’’ అని కుంబ్లే చెప్పాడు. ఇంకా పంజాబ్ జట్టుకు 5 మ్యాచ్‌లు ఉన్నాయని, వాటిలో మంగళవారం వచ్చిన ఫలితాల వంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని అభిప్రాయపడ్డాడు.

అదే సమయంలో పంజాబ్ జట్టు బౌలింగ్ విభాగాన్ని ఆయన కొనియాడారు. దుబాయ్ పిచ్ బ్యాటింగ్ పిచ్ అని, రాజస్థాన్ జట్టు 200-210 పరుగులు చేస్తుందని భావించామని, కానీ బౌలర్లు ప్రత్యర్థిని అద్భుతంగా కట్టడి చేశారని మెచ్చుకున్నాడు. 5 వికెట్లు తీసిన అర్షదీప్, మహమ్మద్ షమీ, హర్‌ప్రీత్ బ్రార్‌ను ప్రత్యేకంగా కొనియాడాడు.